ప్రజాశక్తి - జామి: ఉపాధ్యాయులంటేనే సమాజంలో భాగమని, ఐదు దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంతో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి, హక్కుల సాధనకు పాటుపడుతున్న యుటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలను జయ ప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్ పిలుపు నిచ్చారు. 1974 ఆగస్టు 10న ఆవిర్భవించిన యుటిఎఫ్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చాపురంలో ప్రారంభమైన జాతా శనివారం జామి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా జామి బస్టాండ్‌లో యుటిఎఫ్ జెండా ను సీనియర్ నాయకులు గూనూరు వెంకటరావు ఆవిష్కరించారు. అనంతరం కెఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, యుటిఎఫ్ ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించేందుకు, విద్యారంగాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో స్వర్ణోత్సవాలను అక్టోబర్ 1 న విజయవాడలో నిర్వహిస్తున్నామని,పెద్దఎత్తున ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని పిలునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా, వెరవకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై యుటిఎఫ్ పోరాడుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ విద్య ప్రజలకు మిగిల్చే విధంగా ఉద్యమం సాగిస్తోందని తెలియజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌జిల్లా ప్రధాన కార్యదర్శి జెవిఆర్‌కె ఈశ్వరావు, నాయకులు జిల్లా నాయకులు రెడ్డి మోహన్, తాతంనాయుడు, కె.సూర్య నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో నిరసన
బొబ్బిలి రూరల్ : జిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యాన స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఎస్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగారావు,యుటిఎఫ్ నాయకులు విజయగౌరి, ఆప్టా నాయకులు గణపతిరావు, ఎపిటిఎఫ్ నాయకులు జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.










