Apr 09,2023 23:58

వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న లక్ష్మణరావు తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు :ఉపాధ్యాయుల సమస్యలపై ఆందోళనలతోపాటు, సామాజిక కార్యక్రమాల్లోనూ యుటిఎఫ్‌ కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో శంకర్‌ కంటి ఆసుపత్రి బృందం సౌజన్యంతో స్థానిక బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి మనిషికీ, సంస్థలకూ సామజిక స్పృహ అవసరమన్నారు. యుటిఎఫ్‌ని, శంకర్‌ కంటి ఆసుపత్రి వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌ మాట్లాడుతూ యుటిఎఫ్‌ గతంలోనూ వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ, కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ నిర్వహణ, వరద బాధితులకు ఆర్థిక సహకారం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. శంకర ఆసుపత్రి వైద్యులు కాళీప్రసాద్‌ మాట్లాడుతూ మెరుగైన చికిత్స అందించి కంటి చూపు కాపాడటమే శంకర్‌ కంటి ఆసుపత్రి లక్ష్యమని పేర్కొన్నారు. వైద్య శిబిరంలో 100 మందికి పరీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచురణల కమిటి చైర్మన్‌ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సిహెచ్‌.ఆదినారాయణ, ఎమ్‌డి.షకీలాబేగం, ఎం.గురుబ్రహ్మం, కె.శ్రీదేవి, ఎం.కోటిరెడ్డి, ఎం.ధనరాజారావు, ప్రభూజీ, చిన్నయ్య, బాజీబాబా పాల్గొన్నారు.