Oct 21,2023 19:37

weekly roundup

యుటిఎఫ్‌ పోరుబాట..
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

    ఉద్యోగ ఉపాధ్యాయులకు అధికారంలోకి రాగానే సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చి గద్దనెక్కారు. ఇప్పుడు ఆ హామీని బుట్టదాఖలు చేసి సిపిఎస్‌ రద్దు చేస్తూ జిపిఎస్‌ విధానాన్ని అమలు చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ పోరుబాట పట్టింది. జిల్లా, మండల కేంద్రాల్లో సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాలు రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. ఈ పోరాటానికి ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ, ప్రజాసంఘాలు కూడా మద్దతు తెలియజేశాయి. ప్రపంచ బ్యాంకు ఆదేశాలనుసారం ఆర్థిక సంస్కరణల అమల్లో భాగంగా గతంలో 2004లో ఎన్‌డిఎ ప్రభుత్వం పిఎఫ్‌ ఆర్‌డిఏ బిల్లును తీసుకువచ్చింది. ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీంను రద్దు చేసి సిపిఎస్‌ విధానాన్ని తెరమీదకి తీసుకువచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం సిపిఎస్‌ విధానాన్ని అమలు చేస్తూ ఆమోదం తెలిపారు. అయితే రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిపిఎస్‌ విధానం రద్దు పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్మోహన్‌ రెడ్డి ఈ విధానానికి రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఒపిఎస్‌ విధానాన్ని అమలు చేస్తామని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల పాటు మంత్రుల కమిటీ పేరుతో కాలయాపన చేసింది. ఇప్పుడు సిపిఎస్‌ స్థానంలో జిపిఎస్‌ అమలు చేస్తామని ప్రకటిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. జిపిఎస్‌ విధానం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ కాదని ఉద్యోగ ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు విరమణ పొందిన అనంతరం పెన్షన్‌ వస్తుందో లేదో కూడా గ్యారెంటీ ఇవ్వలేనిఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముక్తకంఠంతో అమలు చేసేందుకు పూనుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిపిఎస్‌ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్‌ డిమాండ్‌ చేస్తుంది. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ చేపడుతున్న పోరాటానికి సిపిఎం, తెలుగుదేశం, ఉపాధ్యాయ సంఘాలు, ఎస్‌టియు, ఎపిటిఎఫ్‌ 1938, జన విజ్ఞాన వేదిక, ప్రజా సంఘాలు సిఐటియు, డివైఎఫ్‌ఐ, కెవిపిఎస్‌ తదితర సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయి.
అవీ.. ఇవీ.. అన్నీ...
ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో టిడ్కో గృహాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ భాష, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు ప్రారంభించారు. మిడుతూరు మండల కేంద్రానికి చెందిన పేదలకు 1996లో ఇచ్చిన పట్టా పాస్‌ పుస్తకాలకు భూములు చూపించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బాధితులు ధర్నా నిర్వహించారు. రైతు సంఘం, సిఐటియు, కెవిపిఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ, బిసి సంఘం నాయకులు ధర్నాకు సంఘీభావం తెలియజేశారు. జిల్లాలో దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ప్రాజెక్టులలోకి చేరని నీరు..
జిల్లాలోని ప్రాజెక్టులలోకి వరద నీరు వచ్చి చేరడం లేదు. ఎగువన వర్షాలు కురవకపోవడంతో శ్రీశైలం జలాశయానికి చుక్క నీరు కూడా రావడం లేదు. అలాగే తుంగభద్ర జలాశయానికి కూడా ఎగువ నుండి నీరు వచ్చి చేరడం లేదు.