Jul 14,2023 00:04

నినాదాలు చేస్తున యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు వెంటనే రద్దు చేయాలని, బదిలీ కాబడిన ఉపాధ్యాయులకు జీతాలు తక్షణఘే చెల్లింపులు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం పాడేరు లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మహేశ్వరరావు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు అనేక పోరాటాలు ద్వారా సాధించుకున్న కౌన్సిలింగ్‌ విధానానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వమే దొడ్డి దారిన అక్రమ బదిలీలు చేయడం అన్యాయమని తెలిపారు. అక్రమ బదిలీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా ఆన్లైన్‌లో బదిలీలు చేస్తున్నామని చెప్పి కొన్ని పోస్టులను బ్లాక్‌ చేసి తీరా కౌన్సిలింగ్‌ ముగిసిన తర్వాత బ్లాక్‌ చేసిన పోస్టులలో దొడ్డి దారిన కొంత మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.దేముడు, జిల్లా కౌన్సిలర్‌ ఎస్‌.కన్నయ్య, ఎస్‌. బాలకృష్ణ , కర్రి బాబు, యం.మోహాన్‌, దుక్కు, బంటు శ్రావణ్‌, లింగన్న తదితరులు పాల్గొన్నారు.