కడప అర్బన్ : ఉపాధ్యాయులు, ఉద్యోగులకు సిపిఎస్, జిపిఎస్ వద్దు ఒపిఎస్ అమలు చేయాలంటూ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజరుకుమార్, పాలెం మహేష్‌బాబు, సహాధ్యక్షులు రవికుమార్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ సుదర్శన్ ఈ నెల 19న ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలు చేపట్టిన నాయకుల ఆరోగ్యం 20వ తేదీ రాత్రి బాగా క్షీణించింది. దీంతో తాలూక సిఐ ఆధ్వర్యంలో యుటిఎఫ్ నాయకుల దీక్షలను భగం చేశారు. చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలను భగం చేసినా ఒపిఎస్ అమలు చేసేవరకు పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగులను వేధిస్తే పుట్టగతులుండవ్
ఉద్యోగ, ఉపాధ్యాయులను వేధిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవని తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అలంఖాన్ పల్లె జి.లక్ష్మీ రెడ్డి హెచ్చరించారు. సిపిఎస్, జిపిఎస్ విధానాలను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని యుటిఎఫ్ భవన్‌లో చేపట్టిన రెండవ రోజు ' నివరధిక నిరాహార దీక్షలను'' సందర్శించి మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా జి.లక్ష్మీ రెడ్డి మాట్లాడుతూ సాధారణ ప్రజలనే కాకుండా ఉద్యోగ, ఉపాధ్యా యులతో సహా అన్ని వర్గాలను వంచించిన ఘనత ఒక్క జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. గత ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యోగులు అడగకుండానే అధికారంలోకి వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తానని మాట ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. దీక్షలకు సంఘీభావంగా పాల్గొన్న ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రమణారెడ్డి, వై.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పాత పెన్షన్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ప్రజలను తప్పుదారి పట్టించడం దుర్మార్గమన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలు, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నదో సమాధానం చెప్పాలన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి బి.రాజశేఖర్ రాహుల్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.డి.దేవదత్తం మాట్లాడుతూ పాత పెన్షన్ అమలు కోసం దీక్షలు చేపట్టిన నాయకుల ఆరోగ్యాలు క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. దీక్షలు చేపట్టిన వారికి కనీసం వైద్య పరీక్షలు చేపట్టకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరిని తేట తెల్లం చేస్తున్నదన్నారు. దీక్షలు చేపట్టిన వారికి ఏదైనా హాని జరిగితే ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్, ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు, సహాధ్యక్షుడు వై.రవికుమార్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ సి.సుదర్శన్ దీక్షలో కొనసాగుతున్నారు. రెండవ రోజు వారి ఆరోగ్య పరిస్థితి దిగజారింది. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఓబుల్ రెడ్డి, యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షురాలు డి.సుజాత రాణి, జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ,యస్.ఎజాజ్ అహ్మద్, వి.పర్వీన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.రూతు ఆరోగ్యమేరి, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.ప్రభాకర్, సిపిఎస్ జిల్లా కో-కన్వీనర్స్ అయ్యవారు రెడ్డి, కె.కరీముల్లా ఆర్.యు.పి.పి జిల్లా ట్రెజరర్ బాల నరసింహులు, ప్రముఖ జాతీయ ఉర్దూ కవి సర్తాజ్ ఫైజీ, ప్రముఖ ఆధునిక కవి మజ్జారి చెన్నకేశవులు పాల్గొన్నారు.యుటిఎఫ్ నాయకులు మాదన విజరుకుమార్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు










