
ప్రజాశక్తి-గుంటూరు : కాంట్రిబ్యూషనరీ పెన్షన్ విధానం (సిపిఎస్) రద్దు, పాత పెన్షన్ విధానం (ఒపిఎస్) సాధనకు యుటిఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలను పోలీసులు శుక్రవారం భగం చేశారు. దీక్షలను అడ్డుకోవటానికి పోలీసులు రెండోరోజు దీక్షా శిబిరం వద్ద హైడ్రామా సృష్టించారు. నిరవధిక దీక్షలకు అనుమతి లేదంటూ ప్రభుత్వ వైద్యుల్ని రప్పించి, దీక్షాపరులకు వైద్య పరీక్షలు చేయించారు. తాము బాగానే ఉన్నామని నాయకులు చెప్పినా వినకుండా దీక్షల్లో ఉన్న ఏడుగురు నాయకుల్ని పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి, గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)కు తరలించారు. పరీక్షల అనంతరం పంపించేశారు. దీక్షలకు సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు ఎం.హరిప్రసాద్, సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు రత్తయ్య, ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎస్.కె.బాషా, యుటిఎఫ్ సీనియర్ నాయకులు జోజయ్య, దుర్గారావు, వినోద తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పాశం రామారావు దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు సంస్కరణల్లో భాగంగా, ప్రభుత్వ రంగాన్ని బలహీన పరచటానికి ఉద్యోగుల పెన్షన్‌ను నిర్వీర్యం చేస్తోందన్నారు. తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు, ఇటీవల కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ వంటివి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమనేనన్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ప్రభుత్వ సేవలు అందించిన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత జీవితానికి భద్రత లేకపోవటం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వం పునరాలోచించి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత నిర్భంధం ప్రయోగించినా సిపిఎస్ ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఒపిఎస్ సాధించుకునేంత వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు. అనేక రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేశారని, అక్కడ లేని సమస్య ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. కార్పొరేట్ల లాభాల కోసమే సిపిఎస్ కొనసాగిస్తున్నాయన్నారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి మాట్లాడుతూ నాలుగున్నరేళ్లపాటు ప్రభుత్వం సిపిఎస్ రద్దు హామీని తొక్కిపెట్టి, ఇప్పుడు ఉద్యోగుల ఆమోదం లేకపోయినా జిపిఎస్‌ను తెరపైకి తెచ్చిందన్నారు. సిపిఎస్, జిపిఎస్ రెండూ ఒకటేనని, సిపిఎస్ కంటే జిపిఎస్ ఇంకా ప్రమాదకరమని చెప్పారు. పాత పెన్షన్ విధానం తప్ప, సిపిఎస్, జిపిఎస్‌ను అంగీకరించబోమని ఉద్ఘాటించారు. దీక్షల్లో కూర్చున్న వారిలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఎఎల్. శివపార్వతి, జిల్లా కార్యదర్శులు సిహెచ్.ఆదినారాయణ, ఎమ్‌డి.షకీలాబేగం, జి.వెంకటేశ్వరరావు ఉన్నారు.
దీక్షలను భగం చేయటంపై సిపిఎం ఖండన
ఉపాధ్యాయుల నిరవధిక దీక్షను పోలీసులు భగం చేయటాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఒక ప్రకటనలో ఖండించారు. ఒపిఎస్ సాధనకు దశల వారీగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవటంతో ఉపాధ్యాయ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక దీక్షకు పూనుకున్నారని, ప్రభుత్వం దీక్షా శిబిరంపై దాడి చేసి, ఉపాధ్యాయ నాయకుల్ని బలవంతంగా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.