Feb 05,2023 23:51

పాడేరులో దీక్షను చేపడుతున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలోని పాడేరు గిరిజన సంఘం భవన ప్రాంగణంలో ఆదివారం యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈనెల 3న గన్నవరం లోని ధర్మస్థలి లో ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించ తలపెట్టిన ''సంకల్ప దీక్ష''ని ప్రభుత్వం, పోలీసులతో బలవంతంగా భగం చేసినందుకు నిరసనగా యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు నిచ్చింది. ఈ మేరకు అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు లో యుటిఎఫ్‌ జిల్లా నాయకులు సిహెచ్‌ నాగేశ్వరరావు అధ్యక్షతన యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.మహేష్‌, అల్లూరి జిల్లా సిపిఎస్‌ కన్వీనర్‌ ఎల్‌.నారాయణరావు ఆధ్వర్యంలో సిపిఎస్‌ రద్దు చేయాలని కోరుతూ సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మహేష్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కొత్తగా ఆలోచిస్తున్న జిపిఎస్‌ వద్దని, ఓపిఎస్‌ మాత్రమే సమస్య కు పరిష్కారమని స్పష్టం చేశారు. ఎటువంటి హామీ ఇవ్వని రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్రాలు సిపిఎస్‌ ను రద్దు చేశాయని, ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో యుటిఎఫ్‌ అల్లూరి జిల్లా గౌరవ అధ్యక్షులు టీ.చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు సిహెచ్‌.నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి రఘునాద్‌, అనంతగిరి మండల అధ్యక్షుడు దేముడు పాల్గొన్నారు.
చింతూరు:సిపిఎస్‌ రద్దు కోరుతూ యుటిఎప్‌ ఆధ్వర్యాన చేపట్టే సంకల్పదీక్షలో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లిన ఉపాధ్యాయుల ఆక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ యూనియన్‌ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు డివిజన్‌ కేంద్రంమైన చింతూరులో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. యుటిఎఫ్‌ జిల్లా సహాయ అధ్యక్షురాలు ఎం.కవిత అధ్యక్షత వహించిన దీక్ష శిబిరాన్ని యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌.నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ముందు పాదయాత్రలో అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ రద్దు సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పడం సబబు కాదన్నారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి తండా కృష్ణయ్య, వెంకటనారాయణ మాట్లాడుతూ, సిపిఎస్‌, జిపిఎస్‌లను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. సిపిఎస్‌ రద్దయ్యే వరకు యుటిఎఫ్‌ పోరాటం చేస్తుందన్నారు. దీక్షలకు వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, సిఐటియు ప్రజా సంఘాల బాధ్యులు కే.సీతారామయ్య, సురేష్‌, లక్ష్మణ్‌ సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో విలీన మండలాల యుటిఎఫ్‌ నాయకులు ఎస్‌.జగదీష్‌, ఎస్‌ రామకృష్ణ, ఎ.నాగేశ్వరరావు, పి.కన్నారావు, సీతా, అబ్బులు దొర, ఏం.సుజాత, బి.ముత్తయ్య, కేె.శ్రీనివాస్‌ దొర, కె.మోహన్‌రావు, కె.భాస్కర్‌, అప్పారావు, ఎస్‌ బాబురావు, తులసి, రత్నకుమారి, ఎన్‌.ప్రసాద్‌ టి రాము, ప్రసాద్‌ శ్రీనివాస్‌, సుబ్బమ్మ పాల్గొన్నారు.