Aug 05,2023 00:14

ధర్నా చేపడుతున్న యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో ఈ ఏడాది బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతభత్యాల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన పాడేరులోని డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం మే నెలలో విద్యాశాఖలో చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు జూన్‌ 12న ముగియడంతో బదిలీ కాబడిన ఉపాధ్యాయులు పాఠశాలలు పున్ణ ప్రారంభమైన రోజు విధులలో చేరారని చెప్పారు. బదిలీలు జరిగి సుమారుగా రెండు నెలలు గడిచినా ఉపాధ్యాయులకు ప్రభుత్వం సకాలంలో జీత భత్యాలు చెల్లించడంలో విఫలమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఏడాది బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతభత్యాల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సి.హెచ్‌ నాగేశ్వరరావు, యం.ధర్మారావు, కె.రఘునాథ్‌, ఎస్‌.గంగాధర్‌, పి.లింగన్న, కె.రాజు పాల్గొన్నారు.