Sep 21,2023 20:57

రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి
ప్రజాశక్తి - భీమవరం
యుటిఎఫ్‌ స్థాపించి 50 ఏళ్లు కావస్తోందని, ఈ నేపథ్యంలో నిర్వహించబోయే స్వర్ణోత్సవాలను జయప్రదం చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ భీమవరం జిల్లా కార్యాలయంలో యుటిఎఫ్‌ 50వ ఏళ్ల స్వర్ణోత్సవాల ప్రచార యాత్ర పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపీమూర్తి మాట్లాడుతూ యుటిఎఫ్‌ 1974లో స్థాపించినట్లు తెలిపారు. 2024 నాటికి స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి విజయవాడ వరకూ ప్రచార యాత్ర చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా ఇచ్ఛాపురంలో ఈ ప్రచార యాత్ర ప్రారంభమైందని తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి విజయవాడ వరకూ రెండో ప్రచార యాత్ర ప్రారంభించినట్లు తెలిపారు. యుటిఎఫ్‌ 50 ఏళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల అధ్యయనం కోసం ఈ రెండు ప్రచార జాతాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యారంగం, ప్రాథమిక పాఠశాలలకు మూసివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాథమిక విద్యారంగం బలోపేతానికి మేధావులతో చర్చించి చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఉపాధ్యాయులకు గొడ్డలిపెట్టుగా మారనున్న జిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు నెలలుగా ఉపాధ్యాయ లోకం ఇప్పటికీ జీతాలు అందుకోలేని పరిస్థితిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే యుటిఎఫ్‌ 50 ఏళ్ల స్వర్ణోత్సవాల ప్రచార యాత్రలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిఎస్‌.విజయ రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి.రామభద్రం, సహాధ్యక్షులు కె.రాజశేఖర్‌, సహాధ్యక్షురాలు కె.శ్రీదేవి, జిల్లా కోశాధికారి సిహెచ్‌ పట్టాభి రామయ్య, జిల్లా కార్యదర్శులు కెఎస్‌ రామకృష్ణప్రసాద్‌, జి.రామ కృష్ణరాజు, పి.క్రాంతి, డి.ఏసుబాబు, జి.లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.