Aug 09,2023 22:31

మాట్లాడుతున్న డాక్టర్‌ అదీబ్‌ హసన్‌

* ఏకరూపం సివిల్‌ కోడ్‌ పేరుతో మతాల మధ్య చిచ్చు
* బిజెపి ప్రయత్నాలను అంతా తిప్పికొట్టాలి
* మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
భిన్నత్వంలో ఏకత్వం జాతీయోద్యమ వారసత్వమని, కలసికట్టుగా ఉన్న దేశ ప్రజల చైతన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దెబ్బతీస్తోందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌ శర్మ అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ యూనివర్సిటీ సెమినార్‌ హాల్‌లో గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యాన యూనిఫాం సివిల్‌ కోడ్‌పై బుధవారం నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. యుసిసి తీసుకురావాలన్నది మోడీ అసలు ఉద్దేశం కాదని, దాన్ని చర్చనీయాంశంగా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షోభాలపై ప్రజలు ఆలోచించకూడదనేది అసలు రహస్యమన్నారు. ముస్లిములు శత్రువులుగా స్థిరపడితే, మోడీకి హిందువులు ఓటేస్తారనేది ఇందులో ఉన్న రాజకీయమన్నారు. అన్ని మతాలు, జాతులు కులాల్లోని అనేక తేడాలు ఉన్నాయని, ఆచారాలు, సంప్రదాయాలను ఒక జాబితా రాస్తే తర్వాత అప్పుడు ఏకరూపానికి ఒక ప్రాతిపదిక వస్తుందని లా కమిషన్‌ చెప్పిందన్నారు. అసలు జాబితా లేనప్పుడు అందరికీ ఏకరూపం తీసుకురావడంపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. ముస్లింలు, హిందువులు, క్రైస్తవుల్లో దురాచారాలు ఏమైనా ఉంటే ఆయా మత పెద్దల్లోనే చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. ఆ తర్వాతే యూనిఫాం సివిల్‌ కోడ్‌పై చర్చించవచ్చని చెప్పారు. గోవాలో పోర్చుగల్‌, యానాంలో ఇప్పటికీ ఫ్రెంచ్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. గిరిజనులో ఆర్థిక పరిస్థితి వల్ల వారిలోనూ బహు భార్యత్వం ఎక్కుగానే ఉందని, దాన్ని అంగీకరించబోమని కేంద్రం చెప్పలేదన్నారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌ గిరిజనులకు కాదని అమిత్‌షా చెప్తున్నారని, కొందరికి మినహాయిస్తే అది ఏకరూపం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ముస్లింలు, హిందువులు పరస్పరం శత్రువులుగా చూడాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమన్నారు. అంబానీ, అదానీకి, మోడీకి మధ్య సంబంధాలు మాత్రం ఎవరూ చూడకూదన్నారు. దక్షిణ భారతదేశంలో మేనరికాలు బలమైన అనాగరిక సాంప్రదాయమని, ఉత్తర భారత దేశంలో దీన్ని ఏమాత్రం అంగీకరించరని ఇటువంటి సందర్భంలో అందరికీ ఏకరూపం ఎలా సాధ్యపడుతుందని చెప్పారు. ఆదాయపన్నుశాఖలో హిందూ అవిభాజ్యత కుటుంబానికి అనేక రాయితీలు ఇస్తోందని, యుసిసి వస్తే ఇతర మతాలకూ ఇస్తారా, హిందూ మతానికి తీసేస్తారా అని ప్రశ్నించారు. మోడీ అనుకున్న దానికి భిన్నంగా ఉండటం వల్లే 2021లో లా కమిషన్‌ చేసిన సిఫార్సులను అమలు చేయలేదన్నారు. యునిఫాం సివిల్‌ కోడ్‌ డిక్లేర్‌ చేసి తీసుకొస్తే అన్ని మతాల నుంచీ వ్యతిరేకత వస్తుందనే దాన్ని మోడీ కప్పిపెట్టారని చెప్పారు. ప్రజల్లో ముందు సమానత్వం తీసుకొస్తే, తర్వాత ఏకరూపం కోసం ఆలోచించవచ్చని చెప్పారు. మణిపూర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాల ఆధ్యర్యంలో మారణహోమం జరుగుతోందన్నారు.
రేడియంట్‌ హెల్‌కేర్‌ వైద్యులు డాక్టర్‌ అదీబ్‌ హసన్‌ మాట్లాడుతూ యుసిసి ముసాయిదా బిల్లు ప్రజల ముందు ఉంచకుండానే దేశవ్యాప్త చర్చకు, అభిప్రాయ సేకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌ కోసం మాట్లాడుతున్న ప్రభుత్వం పౌరుల, సివిల్‌ రైట్స్‌ మాటేమిటని ప్రశ్నించారు. యుసిసి పేరుతో ముస్లింలను అణచివేసేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ముస్లింలు, హిందువుల మధ్య మత ఘర్షణలు రేపి 2024 ఎన్నికల్లో బిజెపి గెలవడానికి ప్రయత్నిస్తోందన్నారు. యూనివర్సిటీ న్యాయ కళాశాల అధ్యాపకులు డాక్టర్‌ వై.రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో వేర్వేరు మతాలకు విభిన్న చట్టాలు ఉన్నాయని చెప్పారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా చట్టాల్లోనూ మార్పులు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. విభిన్న ఆచారాలు, సంప్రదాయాలతో రూపొందించిన చట్టాలను కాదని యుసిసి తీసుకురావడం సరైంది కాదన్నారు.
గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి.జి.కె మూర్తి మాట్లాడుతూ యుసిసి తీసుకురావడం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కాపాడడానికి సివిల్‌ కోడ్‌ అవసరమే గానీ బలవంతంగా రుద్దడం సరికాదన్నారు. కార్యక్రమంలో గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం సభ్యులు పి.సుధాకరరావు, కె.శ్రీనివాసు ఆర్‌.మధుసూదనరావు, కె.రామకృష్ణ, యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రిన్సిపల్‌ బి.వి రమణమూర్తి, కె.ఉదరుకుమార్‌, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.