
ప్రజాశక్తి గుంటూరు జిల్లా ప్రతినిధి : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో యూసిసి బిల్లు ప్రవేశపెడితే దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని బుదవారం గుంటూరులో జరిగిన క్రిస్టియన్, ముస్లిమ్ సంఘాల నాయకులు హెచ్చరించారు. స్థానిక నాజ్ సెంటర్లోని ఓ హోటల్లో బుధవారం జరిగిన సమావేశంలో యూసిసి బిల్లు ప్రతిపాదనలపై పలువురు వక్తలు మండిపడ్డారు. యూసిసి, మణిపూర్ క్రైస్తవులపై దమనకాండ, మోడీ నిరంకుశ వైఖరికి నిరసనగా ఈనెల 19న చలో గుంటూరు కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్టు యూసిసి వ్యతిరేక పోరాట కమిటీ, సెక్యులర్ భారత రాజ్యాంగ రక్షణ కమిటీ అధ్యక్షులు గోళ్ల రాజసుందర్‌బాబు ప్రకటించారు. ఫాస్టర్ నెహేమ్యా గత నెల 8 వ తేదీన పేరేచర్ల నుండి సంగడిగుంటకు వస్తుండగా కొందరు యువకులు కారు అడ్డగించి ఆయనపై దాడి చేసారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంకా పట్టించుకోలేదని అన్నారు. మిమ్మల్ని మరో మణిపూర్లో మాదిరిగా చేస్తామంటూ కొందరు యువకులు హెచ్చరించారని, ఈ విషయంలో జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రభుత్వ ప్రజలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. నిందితులపై కేసు పెడితే పోలీసులు మా పైనే తిరిగి కేసులు నమోదు చేయించారని నెహేమ్యా అన్నారు. నాపై దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేవరకూ క్రైస్తవ, ముస్లిమ్ సోదరులతో ఆందోళన చేపడతామన్నారు. క్రిస్టియన్ సంఘాల అధ్యక్షులు మల్లెల రాజు మాట్లాడుతూ పోలీసులు బాధితుల పక్షాన లేకుండా నేరాలు చేసిన వారికి వత్తాసు పలుకుతున్నారన్నారు. లాలాపేట సిఐ సుబ్బారావును వెంటనే సస్పెండ్ చేయాలని, నెహేమ్యాపై నమోదు చేసిన కౌంటర్ ఎఫ్‌ఐఆర్ వెంటనే ఉపసంహరించుకోవాని డిమాండ్ చేశారు. మతోన్మాదం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకోబోమని ముస్లిమ్ సంఘాల నాయకులు హెచ్చరించారు. అన్ని మతాలు ఐక్యంగా ఉండే సెక్యులర్ దేశంగా కోరుకుంటామని అన్నారు. ముస్లిమ్ నాయకులు ఎమ్‌డి అప్సర్, షేక్ రఫీ మాట్లాడుతూ యుసిసిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలెవ్వరూ కేంద్రం తీరుపై మాట్లాడక పోవడం దారుణమన్నారు. ముస్లిమ్, క్రిస్టియన్ ఓట్లతో గద్దె నెక్కిన వైసీపీ కేంద్రానికి మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. తమపై జరుతుగుతున్న దాడులకు నిరసనగా గుంటూరులో త్వరలో లక్ష మందితో ర్యాలీ చేస్తామన్నారు. ద్వేషం వద్దు దేశం ముద్దు... మనువాదం వద్దు రాజ్యాంగం ముద్దు అని నినాదాలు చేశారు.