ప్రజాశక్తి-గుంటూరు : యూనిఫామ్ సివిల్ కోడ్(యుసిసి)పై రౌండ్‌టేబుల్ సమావేశం బ్రాడీపేటలోని యుటిఎఫ్ మీటింగ్ హాల్లో ఆదివారం నిర్వహించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ఆవాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు షేక్ బాషా అధ్యక్షత వహించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ ఎస్.హనుమంతరెడ్డి మాట్లాడుతూ దేశంలో 44వ అధికరణలో చెప్పిన యుసిసి గురించి జీవోలను బలవంతంగా రుద్దకూడదన్నారు. ప్రజలలో అవగాహన కల్పించి మార్పు తీసుకొని రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.చిష్టీ మాట్లాడుతూ యుసిసి వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, 2024 ఎన్నికల దష్ట్యా తెర మీదకు తెచ్చారన్నారు. 21వ లా కమిషన్ అవసరం లేదని చెప్పినా ఈ విధంగా చేయడంలో కచ్చితంగా రాజకీయ దురుద్దేశం దాగి ఉందన్నారు. స్థూలంగా యుసిసి గురించి ఒక ముసాయిదా చట్టాన్ని ప్రజల ముందు ఉంచాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముస్లిమ్ ఐక్యవేదిక నాయకులు అబ్దుల్ కలాం, సిఐటియు నాయకులు షేక్ అబ్దుల్ సలీం, కె.నళినీకాంత్, ఖిద్మత్ బ్యాంకు చైర్మన్ బషీద్, ఆవాజ్ నాయకులు షేక్ సైదా, షేక్ ఇస్మాయిల్, ఐలు నాయకులు శేషగిరిరావు, నజీర్ పాల్గొన్నారు.










