గత ఏడేళ్లుగా వెనకబడ్డ తరగతుల ప్రజలు హిందూత్వ నుండి దూరం కావటానికి సమాజంలో తమ వాటా పొందటంలో వెనుకబడ్డామని క్రమంగా గ్రహిస్తుండటమే కారణం.
ఫిబ్రవరి, మార్చి మాసాల్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైనది ఉత్తరప్రదేశ్ అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఎన్నికలు 80శాతం ప్రజలకు, 20శాతం ప్రజలకు మధ్య పోరాటంగా ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానిస్తూ, తామే తిరిగి అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రజలమధ్య కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా గతంలో మాదిరి ఓట్లు దండుకోవచ్చన్నదే బహుశా ఆయన ధీమాకు కారణం కావచ్చు.
కానీ గతవారం వారు ఊహించని పరిణామం జరిగింది. బిజెపి - ఆర్‌ఎస్‌ఎస్ నిర్మిత కులాల కోట బీటలు వారడం మొదలైంది. కీలకమైన మంత్రులే కాక పలువురు శాసనసభ్యులు బిజెపికి రాజీనామా చేశారు. చాలా మంది సమాజ్‌వాదిపార్టీలో చేరారు. అంతేకాదు, త్వరలో మరికొంత మంది కూడా రాజీనామా చేస్తారన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా రాజీనామా చేసేవారిలో యాదవేతర వెనుకబడిన కులాలకు (ఒబిసి) చెందిన వారేనని భోగట్టా.
యుపిలో దాదాపు పద్నాలుగేళ్ల వనవాసం తరువాత 2017 ఎన్నికల్లో బిజెపి గెలిచింది. అప్పటి నుంచి ఎన్నికల్లోనూ దానిదే పైచేయి. అంతేకాదు, వ్యవస్థాగతంగా, ఆర్థికపరంగా బలమైన మూలాలు కలిగిన పార్టీ బీజేపీ. గత ఐదేళ్లుగా యుపి రాష్ట్రం ఆర్‌ఎస్‌ఎస్‌కి ఒక ప్రయోగశాలగా మారింది. అందువల్లనే ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు నరేంద్ర మోడీ తరువాత ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ను భావిస్తున్నాయి. గతేడాది ఒక ఆర్‌ఎస్‌ఎస్ మేధావి వ్యక్తిగత సంభాషణల్లో భాగంగా నాతో మాట్లాడుతూ ''యోగి ఆదిత్యనాథ్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం లేకుండానే అతని ఆహార్యం, హిందూత్వ పట్ల అతనికి గల అచంచల విశ్వాసం వల్ల ఈ దేశాన్ని హిందూ రాష్ట్రం అని పిలవొచ్చు'' అని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు అతని నాయకత్వంలోనే బిజెపి నుండి వలసలు ప్రారంభమయ్యాయి.
ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏమిటంటే ఈ వలసలన్నీ ఎన్నికల ముందు సాధారణంగాజరిగే, కోరుకున్న టిక్కెట్టు రాకపోవడం వల్ల జరిగే వలసలేనా? లేక అంతకన్నా లోతైన సంకేతం ఏదైనా ఇందులో ఇమిడి ఉందా? నిజంగా ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి కూటమికి వెనకబడిన తరగతులలోగల సామాజిక పునాది బీటలు వారుతున్నదా ? అన్నదే.
మండల్ నుండి కమండలానికి
ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి వ్యూహకర్తలు ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిందేమిటంటే గుజరాత్, మధ్యప్రదేశ్‌లో వలే యూపీలో సైతం మేము ఇతర వెనుకబడిన వర్గాలలో చీలికలు సృష్టించి, వారిని మండల్ రాజకీయాల నుండి కమండల రాజకీయాల వైపు, అంటే హిందుత్వ వైపు తేగలిగామని. ఒకవేళ వారన్నది నిజమే అయితే ఇంత పెద్దఎత్తున ఈ వలసలకు కారణం ఏమిటో వారే వివరించాలి. స్వామిప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్, ధరమ్ సింగ్‌సైని వంటి పెద్ద నాయకులు తమ టికెట్లకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ ఎందుకు తిరుగుబాటు చేశారో వివరించాల్సిన అవసరం ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి కూటమికి ఉంది.
మతతత్వ వాదానికి, లౌకికవాదానికి మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నపటికీ, గత ఏడేళ్లుగా వెనకబడ్డ తరగతుల ప్రజలు హిందూత్వ నుండి దూరం కావటానికి సమాజంలో తమ వాటా పొందటంలో వెనుకబడ్డామని క్రమంగా గ్రహిస్తుండటమే కారణం. సామాజిక న్యాయం తమకు దక్కటం లేదనీ, పరిపాలనలో, ఉద్యోగాలలో కూడా తమ వాటా తమకు దక్కకుండా పోతున్నదన్న విషయాన్ని వారు గ్రహించారు. ప్రజాపాలనలో కూడా తమ భాగస్వామ్యం లేకుండా పోతోందనీ, తాము నామమాత్రంగా మిగిలిపోతున్నామనీ వారు భావిస్తున్నారు. కానీ బిజెపి నాయకత్వం ఈ సమస్యను గుర్తించడానికిగానీ, పరిష్కరించడానికిగానీ ఎంత మాత్రం సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనర్గళ ఉపన్యాసాలూ, ఎల్లెడలా కనిపించే సంఫ్‌ు పరివార్ యంత్రాంగం, పార్టీ దగ్గర ఉన్న లెక్కలేనన్ని నిధులు, అలాగే ఎలక్షన్ల నిర్వహణలో దానికి ఉన్నటువంటి నైపుణ్యం తమను రాబోయే ఎన్నికల్లో కూడా గట్టెక్కిస్థాయని వారు ఎంతగా చెప్పుకున్నప్పటికీ ఈ తిరుగుబాటు మాత్రం వారిని కలవరపరుస్తున్నది.
మసకబారుతున్న బిజెపి ప్రభావం
ఓ అంచనా ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని వెనకబడిన వర్గాలలో బిజెపి అనుకూల హిందూత్వ అనుకూల ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. దీనికి కారణం కేంద్రంలో బలమైన ఒబిసి నాయకుడు కనిపించకపోవడం ఒకటైతే, రాష్ట్రంలో కూడా ఓబిసికి చెందిన బలమైన రాజకీయ నాయకత్వం లేకపోవడం. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిత్వంలో పూర్తిగా అప్రధానమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. బిజెపి కూడా కేశవ్ ప్రసాద్‌ని అతని మాటల గారడీతో మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి మాత్రమే ఉపయోగించుకున్నది. నిజానికి మోడీ స్వయంగా తాను ఒబిసి అని చెప్పుకున్నప్పటికీ ఒబిసి వర్గాల ప్రజల సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ప్రజలు ఆయన్ని ఇక ఎంత మాత్రం బిసిల ప్రతినిధిగా భావించటం లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం తరువాత ఆయనను కార్పొరేట్ల ప్రతినిధిగానే ఒబిసి వ్యవసాయక వర్గాల ప్రజలు భావించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అంతే కాదు, ఆయనను సాంప్రదాయక అగ్రవర్ణాల భావజాల మైన ''హిందూత్వ'' ప్రతినిధిగానే వారు భావిస్తున్నారు. అంతేకాదు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10శాతం రిజర్వేషన్లు కల్పించటం కూడా ఆయనకున్న ఒబిసి ఇమేజిని పూర్తిగా మసకబార్చింది. ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల తీవ్ర ఒత్తిడికిలోనై తీసుకువచ్చిన ఇటువంటి రాజ్యాంగేతర సవరణల వల్ల ఒబిసి వర్గాల యువతలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది.
ఈ వ్యతిరేకతను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ఆ యువత వెలిబుచ్చింది. ఆలిండియా వైద్య కోర్సుల విషయంలో కూడా ఒబిసి రిజర్వేషన్లను అమలు పరచడంలో నష్టకరంగా వ్యవహరించిన తీరు వల్ల ఆ తరగతులకు చెందిన యువతలో బిజెపి పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యకు వ్యతిరేకంగా తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ తీసుకున్న చర్యలకు బీహార్, ఉత్తరప్రదేశ్ ఒబిసి యువత నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. వైద్య కోర్సుల్లో ఒబిసి రిజర్వేషన్లను పునరుద్ధరించడాన్ని హర్షిస్తూ హిందీ మాట్లాడే రాష్ట్రాల ఒబిసి యువత నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు సాంఘిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువెత్తాయి. సమాజంలో బలమైన గొంతుక కలిగిన ఒబిసి నాయకత్వం కూడా బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకోవటానికి మరో కారణం ఏమిటంటే జస్టిస్ జి రోహిణి కమిషన్ నివేదిక ఆధారంగా ఓబీసీ రిజర్వేషన్లను వర్గీకరించడానికి బీజేపీ పూనుకోవడమే.
వ్యవసాయం, జనాభా లెక్కల విషయంలో సమస్యలు
దేశంలోని మిగిలిన అన్ని వర్గాల వల్లే ఒబిసి ప్రజానీకం కూడా ద్రవ్యోల్బణం, పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలవల్ల యూపీలో ఉద్యోగిత తగ్గిపోయి నిరుద్యోగిత ప్రమాదకరస్థాయిలో పెరిగిపోయింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతాంగంతో పాటు ఉత్తరప్రదేశ్ రైతాంగం కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నది. అందులో ఓబీసీ రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొన్నదనే విషయాన్ని వేరే చెప్పనక్కర్లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమాన్ని అణచి వేసిన తీరు పట్ల ఒబిసి వ్యవసాయదారులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇక మూడవదీ మరీ ముఖ్యమైనదీ ఏమిటంటే కులగణన డిమాండును బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చటం. కుల గణనకు వ్యతిరేక వైఖరి తీసుకోవడం వల్ల బిజెపిపౖౖె అసంతృప్తిని ర్యాలీల ద్వారా సెమినార్ల ద్వారా పత్రికా ప్రకటనల ద్వారా ఆయా వర్గాలు ఒక్క చోట కాదు వారణాసి, ఘాజీపూర్, జాన్పూర్, లక్నో వంటి అనేక ప్రాంతాలలో తెలియజేశాయి.
ఈ కారణాల వల్ల ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కూటమి తాము నిర్మించామని చెప్పుకుంటున్నా విభజన ఆధారిత, మతవిద్వేష ఆధారిత కోట బీటలు వారుతోందని చెప్పక తప్పదు. అయితే సమీప భవిష్యత్తులో ఏం జరుగనున్నది అన్న విషయం చెప్పటం కష్టం. కానీ, రేపటి ఉత్తరప్రదేశ్ ఎన్నిక బిజెపికి ఎంతమాత్రం నల్లేరు మీద నడక కాదు.










