న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కేంద్రంలోని అధికార బిజెపికి ఎంతో కీలకం. దేశంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు కల్గిన యుపిలో తిరిగి అధికారాన్ని చేపట్టి.. తమ సత్తా చాటాలని ఊవిళ్లూరుతోంది యోగి సర్కార్. ప్రధాని నియోజకవర్గమైన వారణాసి కూడా యుపిలోనే ఉండటంతో.. అక్కడ విజయం సాధించి... ఆయనకు గిఫ్టు ఇచ్చేందుకు కుస్తీలు పడుతోంది. అయితే ఈ సారి తగ్గేదెలే అంటూ.. బిజెపికి గట్టి పోటీనిస్తానంటోంది అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ. కాంగ్రెస్.. ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న ప్రియాంక గాంధీ.. ఆ భారాన్నంతా మోస్తున్నారు. ఇక మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి) నామ్‌కే వాస్తగా మారిపోయింది. గతంలోలా కాకుండా మాయవతి ఎందుకో వెనుకబడ్డారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఏమైందమ్మా.. ఈనాడు...
గత కొన్ని రోజులోగా బిఎస్‌పి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఎన్నికలు అనగానే.. ముందు అంతా ప్రణాళికలు వేసుకుని.. ఏ పార్టీపై టార్గెట్ చేయాలనుకుంటే.. దానిపై విమర్శలతో విరుచుకుపడే మాయవతి ... ఇప్పుడు నిమ్మలంగా ఉండటం అక్కడి రాజకీయ శ్రేణుల్లో ఆసక్తి, ఆందోళన కలిగిస్తోంది. మీడియాతో కూడా అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె ఈసారి ఎన్నికల్లో ' సారీ' అంటారా అనే సందేహం కలుగకమానదు. గతంలో దళితులు-బ్రాహ్మణులను ఏకం చేసి.. ఏకచత్రాధిపత్యంతో అధికారాన్ని చేపట్టిన మాయవతి.. ఇప్పుడు పార్టీ నేతలు.. ఇతర పార్టీలకు వలసలు కడుతున్నా.. మిన్నకుండా ఉండిపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. అయితే ఆదివారం జరిగిన సమావేశంలో యుపి ఎన్నికల్లో పోటీకి దిగే గెలుపు గుర్రాల తుది జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఆమె మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఆమెను కొంత కాలం నుండి అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతోనే ఉత్సాహంగా పార్టీ పనుల్లో నిమగమవ్వలేకపోతున్నారని అంతర్గతంగా వార్తలు వస్తున్నాయి. ఏదైనా బిఎస్‌పి ఓటు బ్యాంకు.. ఎస్‌పికే మళ్లే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి.

బిఎస్‌పి ఓట్లు చీలుతాయా..?
ఈసారి ఎన్నికల్లో బిఎస్‌పి పాత్ర అంతంత మాత్రమే అయితే.. లబ్ది పొందేదీ ఎవరన్నదీ ప్రశ్నగా మారింది. బిఎస్‌పికి మద్దతు తెలుపుతున్న బ్రాహ్మణులు... బిజెపికే మొగ్గు చూపుతారని కమలదళం భావిస్తోంది. అయితే కాంగ్రెస్ కూడా యాక్టివ్‌గా ఉండటంతో ఈ ఓట్లలో చీలికలు జరగవచ్చునని అంచనా. ఇక బిఎస్‌పి వాస్తవ ఓటుబ్యాంకు అయిన దళితుల ఓటర్లను కాంగ్రెస్ ఎంత వరకు తమ వైపు తిప్పుకుంటుందో వేచి చూడాలి. తొలుత దళితుల ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు మెండుగా ఉండగా... తర్వాత బిఎస్‌పికి మళ్లింది. ఇప్పుడు తిరిగి తన వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో తెలియాల్సి ఉంది. మరోవైపు ముస్లింలు కూడా బిఎస్‌పి నుంచి ఎటువైపు మొగ్గుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముస్లింలు అఖిలేశ్ పార్టీకి ఓట్లు వేయొద్దంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల పిలుపునివ్వడంతో.. బిజెపికి ప్రయోజనం కలిగించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అదేవిధంగా ఎస్‌పి కూడా బిసి, అంబేద్కర్ వాదులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బిజెపిని ఓడించేందుకు ఈ వర్గాలకు అఖిలేష్ ఇచ్చిన పిలుపు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో దళితులు సైతం ఇటు వైపు మొగ్గు చూపవచ్చు. మరోవైపు ముస్లింలు కూడా బీఎస్పీ నుంచి ఎటువైపు మొగ్గుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రజల నాడీ తెలిసిపోయిందా.. అందుకే అఖిలేష్ టార్గెట్టా..?
రాష్ట్ర్రమేదైనా ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యిందంటే కమల దళం అలర్ట్ అవుతుంది. ప్రాధాన్యత రాష్ట్రమైతే... ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార ర్యాలీ తేదీలు ఖరారు చేసేస్తారు. ఇప్పుడు యుపిలో కూడా అదే నెలకొంది. యుపిలో ఎన్నికలకు ముందే అఖిలేష్ యాదవ్... సన్నిహితులు, పార్టీ నేతల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖతో సోదాలు చేయించింది. అంతేకాకుండా.. ఇటీవల ఓ బహిరంగ సభలో అఖిలేష్‌నుద్దేశించి ప్రధాని మోడీ.. ఎర్రటోపీని పెట్టుకున్న వారితో జాగ్రత్త అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అఖిలేష్ సైతం.. బిజెపి ఓడిపోతుందనే భయంతో తనపై దాడి చేస్తోందని బహిరంగంగా విమర్శలు చేశారు. మొత్తంగా యుపిలో ఎస్‌పి వర్సెస్ బిజెపిగా పోటీ మారిపోయింది. మాయావతి మౌనం ఆ పార్టీని భారీగా దెబ్బతీయనుంది.










