న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల్లో పోలింగ్ మొదలైంది. గోవా, ఉత్తరాఖండ్‌లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. యుపిలో రెండవ దశ పోలింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఓటర్లనుద్దేశించి ట్వీట్ చేశారు. ' ఉత్తరాఖండ్, గోవాతో పాటు యుపిలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లందరూ రికార్డు స్థాయిలో ఓటువేసి, ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలి' అని పిలుపునిచ్చారు. గోవా వాసులనుద్దేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అవినీతి వ్యవస్థను మార్చి గోవాను అవినీతి రహితంగా మార్చే శక్తి మీకు ఉందని, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు బయటకు వచ్చి ఓటు వేయండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్‌లో పోలింగ్ సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకూ కొనసాగుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ఉంటుందని ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని 55 అసెంబ్లీ స్థానాలకు, గోవా, ఉత్తరాఖండ్‌లోని అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. యుపిలో రెండవ దశలో 586 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. వీరి భవితవ్యాన్ని 2.02 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 81 లక్షల మంది ఓటర్లున్న ఉత్తరాఖండ్‌లో 70 స్థానాల్లో 152 మంది స్వతంత్రులతో సహా 632 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో 11 లక్షల మంది ఓటర్లు ఉండగా, 40 అసెంబ్లీ స్థానాల నుంచి 301 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒకే దశలో సోమవారం ఎన్నికలు జరిగే ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. గోవాలో కాంగ్రెస్, బిజెపిలే కాకుండా ఈ సారి ఆప్, టిఎంసి కూడా కొత్తగా బరిలోకి దిగడంతో ఇక్కడ బహుముఖ పోటీ ఉంది. ఉత్తర ప్రదేశ్‌లోని రోహిల్‌ఖండ్ సహా తొమ్మిది జిల్లాల పరిధిలో ఉన్న 55 సీట్లకు జరగనున్న ఈ రెండో దశ ఎన్నికల్లో 586మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ మూడు రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. స్వేచ్ఛగా, సక్రమంగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు కోవిడ్ నిబంధనలను కూడా కచ్చితంగా అమలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గోవా, ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రులు ప్రమోద్ సావంత్, పుష్కర్ సింగ్ ధామి, మాజీ సిఎం హరీష్ రావత్, యుపిలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు.










