Feb 13,2022 07:22

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్‌కు ప్రచారం శనివారంతో ముగిసింది. మొత్తంగా తొమ్మిది జిల్లాల పరిధిలోని 55 సీట్లకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో జరిగే ఎన్నికల్లో 586మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. షహరాన్‌పూర్‌, బిజ్నోర్‌, ముర్దాబాద్‌, సంభాల్‌, రాంపూర్‌, అమ్రోహా, బుదాన్‌, బరేలి, షాజహాన్‌పూర్‌ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా వుంది. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పట్టు వుందని భావిస్తున్నారు. సమాజ్‌వాదీ సీనియర్‌ నేత మహ్మద్‌ ఆజంఖాన్‌, యోగి ప్రభుత్వంలో మంత్రిగా వుండి ఎన్నికలు ప్రకటించిన తర్వాత సమాజ్‌వాదీలోకి ఫిరాయించిన ధరమ్‌ సింగ్‌ సైని, యుపి ఆర్థిక మంత్రి సురేష్‌ ఖన్నా తదితరులు ఈ ప్రాంతంలో బరిలో ఉన్నారు. ఆజంఖాన్‌ తనకు పెట్టనికోట అయిన రాంపూర్‌ నుంచి పోటీ చేస్తుండగా, ఖన్నాన షాజహాన్‌పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. నకుడ్‌ అసెంబ్లీ సీటు నుంచి సైని బరిలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 55సీట్లలో 38సీట్లను 2017లో బిజెపి గెలుచుకుంది. సమాజ్‌వాదీకి 15స్థానాలు రాగా, కాంగ్రెస్‌కు రెండు దక్కాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పొత్తు పెట్టుకున్నాయి. సమాజ్‌వాదీ గెలిచిన 15సీట్లలో పదిమంది ముస్లిం అభ్యర్థులే ఉన్నారు. స్వేచ్ఛగా, సక్రమంగా పోలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటుగా కోవిడ్‌ నిబంధనలను కూడా కచ్చితంగా అమలు చేస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఎస్‌పిలోకి కాంగ్రెస్‌ అభ్యర్థి జంప్‌
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్‌నిస్తూ.. ఆ పార్టీ అభ్యర్థి సలీమ్‌ ఖాన్‌ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి)లోకి జంప్‌ అయ్యారు. అమ్రోహా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించిన సలీం ఖాన్‌ రాష్ట్రంలో రెండో దశ ఎన్నికలకు ముందు ఎస్‌పిలో చేరారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి గురించి పార్టీ అధిష్టానానికి తెలియజేసేందుకు ప్రయత్నించానని, రాహుల్‌, ప్రియాంక గాంధీలను కలవాలనుకోగా.. ద్వితీయ శ్రేణి నాయకత్వం అంగీకరించని నేపథ్యంలో.. విసిగిపోయి.. ఎస్‌పిలోకి వెళ్లిపోయినట్లు సలీమ్‌ తెలిపారు.