ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం, పెద నాగమయ్యపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల భవనం స్లాబ్ పైకప్పు పెచ్చులూడుతున్న నేపథ్యంలో నాడు, నేడు కింద పాఠశాల పునరుద్ధరణ పనులు సత్వరమే చేపట్టాలని ఎంపిపి దంతులూరి వెంకట శివ సూర్య నారాయణ రాజు (వాసు రాజు) సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. నాడు, నేడు పథకం కింద మంజూరైన రూ.16 లక్షల్లో రూ.4 లక్షలతో ప్రహరీ, మిగిలిన రూ.12 లక్షలతో టాయిలెట్ల నిర్మాణం, ఇంగ్లీష్ ల్యాబ్, డైనింగ్ హాల్, గ్రీన్ చాక్ బోర్డ్, ఆట స్థలం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా గ్రామంలో బోరు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఎంపిపి దృష్టికి ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లారు. ఎంపిపి వెంట పెదనాగమయ్యపాలెం, అన్నవరం పంచాయతీల సర్పంచులు బొడ్డు సత్తమ్మ, మేరుగు సంతోషి కుమారి, దాకమర్రి ఎంపిటిసి సభ్యులు చెల్లూరి నగేష్ బాబు, వైసిపి నాయకులు పొట్నూరు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద నాగమయ్యపాలెం గ్రామ సచివాలయంలో ఉద్యోగులు,సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.










