ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తనకెంతో ఇష్టమైన ద్వంద్వ ఇంజన్ల సారూప్యతను ఉపయోగించారు. ఉత్తరప్రదేశ్‌లో ద్వంద్వ ఇంజన్ల వృద్ధి రెండు విధాల ఫలితాలను ఇస్తుందని వ్యాఖ్యానించారు. అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఇక్కడ 'రెండు ఇంజన్లు' అంటే సరైన అర్ధాన్ని కూడా ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేశారు. మతోన్మాదం, కులతత్వం కలయిక గురించి ఆయన ప్రస్తావించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో, మోడీ, ఆదిత్యనాథ్ నాయకత్వంలో బిజెపి మతోన్మాదం, కుల సమీకరణ వంటి రెండు ఇంజన్లను రూపొందించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రైతాంగ పోరాటం నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రసంగాన్ని మనం చూడాల్సి వుంది. ప్రజలు భయంతో ఇళ్ళలోనే వుంటూ, ఆడపిల్లలు బయటకు అడుగు పెట్టడానికే భయపడే రోజుల్లో...అంటే నాలుగైదేళ్ల క్రితం నాటి పరిస్థితుల గురించి ఆయన ప్రజలకు గుర్తు చేయడంలో ఏమాత్రం విఫలంకాలేదు. ఈ భయానక వాతావరణంతోనే చాలామంది తమ పూర్వీకుల ఇళ్లను వీడి పారిపోయారు. ముస్లిం క్రిమినల్స్ భయం కారణంగా షామ్లి జిల్లాలో వందలాది కుటుంబాలు 2016లో తమ ఇళ్లను వీడి పారిపోయారంటూ బిజెపి ఎం.పి హుకుమ్ సింగ్ చెప్పిన తప్పుడు కథనాన్నే ఇది ప్రతిబింబిస్తోంది.
మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్శిటీ ఏర్పాటు కూడా జాట్ శిరోమణికి నివాళిగానే అంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లలో ప్రకటించారు. మహేంద్ర ప్రతాప్ సింగ్‌ను కేవలం జాట్ నాయకుడి స్థాయికి తగ్గించడం చాలా అసంబద్ధంగా వుంది. ఆయన ఒక విప్లవ కార్యకర్త. ఇతర ముజాహిదీన్లతో కలిసి ఆయన 1915లో ఆఫ్ఘనిస్తాన్‌లో భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన అధ్యక్షుడిగా వుండగా, మౌల్వి బర్కతుల్లా ప్రధానిగా నియమితులయ్యారు. ఆయన సోషలిస్టు, లౌకికవాద దృక్పథానికి, వేర్పాటువాద మతతత్వ లేదా కుల గుర్తింపునకు ఎలాంటి సంబంధం లేదు. అయితే, బిజెపి మాత్రం జాట్‌లలో కొంత మంచితనాన్ని పెంచుకోవడానికి విఫలయత్నం చేసింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మొత్తంగా జాట్ కమ్యూనిటీ అంతా పోరాటం చేస్తున్న తరుణంలో ఈ పరిస్థితి సంభవించింది.
ఇక ఆదిత్యనాథ్ తన అలవాటు ప్రకారం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టారు. అలీగఢ్‌లో సమావేశానికి కొద్ది రోజులు ముందుగా, ఖుషినగర్‌లో బహిరంగ సమావేశంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ రేషన్లు పొందుతున్నారు. కానీ 2017కి ముందు ప్రతి ఒక్కరికి రేషన్ వచ్చేదా? అని ప్రశ్నించారు. అబ్బా జాన్ అనేవారు మాత్రమే రేషన్ అంతా తీసుకునేవారని అన్నారు. కానీ, ఇంత దారుణమైన ముస్లిం ఎర ఘోరంగా విఫలమైంది. కాగా, నిత్యావసర సేవలు అందుకోవడంలో అత్యంత దారుణంగా అణచివేయబడిన వర్గాల్లో ముస్లింలు వున్నారని ఉత్తరప్రదేశ్ గణాంకాలు చెప్తున్నాయి.
ముస్లింలను ఏకాకులను చేసి, వారిని రాక్షసంగా చూపిస్తూనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా అందరి వికాసం, అభివృద్ధి కోసం తాము ఎలా పని చేస్తున్నామో అనర్గళంగా చెబుతున్నాయి. ప్రభుత్వాల సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో అన్ని వర్గాల ప్రజలు వున్నారని పేర్కొంటున్నాయి. ఈ రకమైన వైఖరే ప్రధాని, పార్టీ పేరుతో ప్రభుత్వ పథకాలను బిజెపి హైజాక్ చేయడానికి దారి తీసింది. నరేంద్ర మోడీ 71వ జన్మదిన వేడుకల కోసం ఆయన ఫోటోతో 14 కోట్ల రేషన్ సంచులను పంపిణీ చేయాలని బిజెపి నిర్ణయించింది. తమ నేతను ఎక్కువ చేసి చూపించేందుకు ప్రజలకు ఆహారధాన్యాలు అందించే ప్రభుత్వ పథకాన్ని పాలక పార్టీ ఉపయోగించుకుంటోంది. బిజెపి ఫ్యూడల్ దృక్పథంతో, భారతదేశ ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే చూడబడుతున్నారు. సమాన హక్కులు కలిగిన పౌరులుగా వారిని చూడడం లేదు.
/ 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం /










