ప్రజాశక్తి-గుంటూరు : పోస్టల్ రంగంలో జాతీయ కార్మిక సంఘంగా పేరుపొందిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికమని, ఏకపక్షంగా చేసిన ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మధ్యతరగతి సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. గురువారం స్థానిక బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశానికి బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం.సాంబశివరావు అధ్యక్షత వహించారు. పోస్టల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పోరాటాల్లో కీలకపాత్ర పోషిస్తూ, ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తున్న తమ యూనియన్ గుర్తింపును కక్షపూరితంగా రద్దు చేశారని తెలిపారు. రైతుల ఉద్యమానికి సహాయపడ్డామనే కారణంతో యూనియన్ల మనుగడపై దాడి చేయడం అమానుషమని అన్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి షేక్.అబ్దుల్‌సలీం మాట్లాడుతూ పోస్టల్ యూనియన్ గుర్తింపు రద్దుకు ప్రభుత్వం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని, అత్యంత అసంబద్ధంగా ఉన్నాయని తెలిపారు. కార్మిక చట్టాలను ఏకపక్షంగా రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు కార్మిక సంఘాలపై దాడి చేస్తోందని అన్నారు. సమావేశంలో వివిధ సంఘాల తరఫున వై.నేతాజీ, ఎం.కళాధర్, ఎం.హనుమంతరావు, వివికె.సురేష్, సిహెచ్.విద్యాసాగర్, ఎన్.నాగేశ్వరరావు, ఎమ్‌డి అక్బర్ పాల్గొన్నారు.










