ప్రజాశక్తి -సీలేరు
యూనియన్ బ్యాంక్‌లో 104వ వార్షికోత్సవం జీకే వీధి మండలం సీలేరు యూనియన్ బ్యాంకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీటీసీ పిల్లా సాంబమూర్తి, మేనేజర్ ప్రవీణ్ కుమార్, బాలాజీ లాడ్జి ఓనర్ బాలాజీ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసి పిల్ల సాంబమూర్తి మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు అభివృద్ధికి సిబ్బంది కృషి చేయాలన్నారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 103 సంవత్సరాలు పూర్తి చేసుకుని 104 సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో వార్షికోత్సవం జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉందన్నారు. యూనియన్ బ్యాంకు ముంబైలో 1919 నవంబర్లో సీతారాం పోదార్, స్థాపించారని పేర్కొన్నారు. అంచలంచెలుగా భారతదేశంతో పాటు ఇతర దేశాలలో 8,900 యుబిఐ బ్రాంచ్‌లు విస్తరించినట్లు చెప్పారు. యూబిఐ బ్యాంకుల ద్వారా రూ.18 లక్షల కోట్లు టర్నోవర్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూబిఐ అసిస్టెంట్ మేనేజర్ శంకర్ సాహు, క్యాషియర్ అవినాష్, సోమేన్ జాన్ సిబ్బంది విశ్వనాథం సుందర్ తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి
రాజవొమ్మంగి : రాజవొమ్మంగి యూనియన్ బ్యాంక్ ద్వారా అందించే సేవలు ఖాతాదారుల సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఆర్ మహేష్ అన్నారు. యూనియన్ బ్యాంక్ ఏర్పడి 103 పూర్తి అయిన నేపథ్యంలో ఆ బ్యాంక్ ఆధ్వర్యంలో స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో రూ.1.50లక్షలతో నిర్మించిన టాయిలెట్స్ బ్లాక్‌లను యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఆర్.మహేష్ రెడ్డి, ఎంపిడిఓ కె బాపన్నదొర, స్థానిక ఎస్‌ఐ టీజి నరేంద్ర ప్రసాద్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజర్ మహేష్ మాట్లాడుతూ బ్యాంకు అందించే సేవలు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సత్యవేణి సిబ్బంది పాల్గొన్నారు.










