ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ గుర్తింపు అసోసియేషన్ ఎన్నికలలో యునైటెడ్ ప్యానల్-2 గెలుపొందింది. యునైటెడ్ ప్యానల్ 1, 2 పోటీ పడ్డాయి. దీనికి సంబంధించి శనివారం జరిగిన ఎన్నిక పోలింగ్‌లో 76 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 3552 ఓట్లు ఉండగా 2746 పోలయ్యాయని, 2737 చెల్లుబాటు అయినట్లు తెలిపారు. యునైటెడ్ ప్యానల్ -1కు (వాచ్ గుర్తుకు)కు 1300 ఓట్లు రాగా యునైటెడ్ ప్యానల్ -2 (మొబైల్ ఫోన్)కు 1437 ఓట్లు వచ్చాయి. 137 ఓట్ల మెజారిటీతో రెండో ప్యానల్ గెలుపొందింది.
ఈ సందర్భంగా గెలుపొందిన అసోసియేషన్ అధ్యక్షులు బొండా తౌడన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బయ్యే మల్లయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో తమ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్ల అమలుతో పాటు స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తామన్నారు. నోషనల్ సీనియారిటీ బెనిఫిట్‌ను అర్హులందరికీ అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. గెలుపొందిన వారిలో ప్యానెల్ సభ్యులు ఎం.గణేష్, జి.వేణుగోపాలరావు, డి.పుల్లారావు, ఎల్‌వి. రమణారావు, ఎస్.మోహన్‌బాబు, లక్ష్మణమూర్తి, డి.అప్పారావు, ఎం.పైడికొండలరావు, జి.ఫణీంద్రబాబు, బి.కిషోర్‌సింగ్, కేవీ.రత్నం, బిడి.నాయక్ కాగా వీరికి వైటిదాస్, చిరంజీవి, బి.లాల్, బూలా జగ్జీవన్‌రామ్, కె.చిన్నంనాయుడు, రవీంద్ర, రాంబాబు తదితరులు సహకరించారు.










