Jul 13,2023 22:42

ప్రజాశక్తి - యు.కొత్తపల్లి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం కొత్తపల్లిలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు ఓలేటి రాయభాస్కరరావు, సిపిఐ నాయకుడు, టైలర్‌ ఆదిమల్ల గోపాలకృష్ణ మూర్తి కుటుంబ సభ్యులను ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ రాయ భాస్కరరావు, గోపాల కృష్ణమూర్తి తనకు బాగా సన్నిహితులని చెప్పారు. తొలుత ఆయన కొత్తపల్లి వైస్‌ ఎంపిపి మాదిరెడ్డి దొరబాబు నివాసానికి చేరుకున్నారు. కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఇటీవల జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు లేఖలు రాయడం కాపు నాయకుల్లో పెద్ద దుమారాన్ని రేపింది. వైసిపి నుంచి పిఠాపురం ఎంఎలఎ అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సందర్భంలో ముద్రగడ కొత్తపల్లి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమీనాబాద్‌ సర్పంచ్‌ నక్కా మణికంఠ బాబు, ఎండపల్లి ఎంపిటిసి, యువ న్యాయవాది ఎం.విజయ తాత, సీనియర్‌ వైసిపి నాయకుడు సానా నాగు ముద్రగడ వెంట ఉన్నారు.