ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గత ప్రభుత్వ హయంలో చేపట్టిన భూగర్భ డ్రెయినేజి పనులను పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలిసింది. ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కన్పించడం లేదు. మరో నాలుగు నెలల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందని ఇందువల్ల ఇప్పటికిప్పుడు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశాలు కన్పించడం లేదని అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు నాలుగు ఏళ్ల క్రితం అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మళ్లీ ఇంత వరకు ప్రారంభం కాలేదు. ఎప్పటికి ప్రారంభిస్తారో కూడా తెలియదు. గత ప్రభుత్వ హయంలో డ్రెయినేజి పైపు లైను నిర్మాణం వల్ల తవ్విన గుంతల వల్ల రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. గత రెండేళ్లలో కొన్ని రోడ్లు పునరుద్ధరించారు. ఇంకా కొన్ని చోట్ల రహదారులను పునరుద్ధరించాల్సి ఉంది.
సిఎం జగన్ గత ఏడాది అక్టోబరులో గుంటూరు వచ్చిన సమయంలో భూగర్భ డ్రైనేజిపనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భూగర్భ డ్రెయినేజిపనులకు రూ.230 కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం జగన్ చేసిన ప్రకటన ఆచరణకు నోచుకోలేదు. మొత్తం రూ.903.82 కోట్ల అంచనాలతో 2017 జనవరి 30న భూగర్భ డ్రెయినేజి పనులు ప్రారంభించారు. 2019 మే నెల వరకూ దాదాపు 50 శాతం పనులు జరిగాయి. టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరులో తీవ్ర జాప్యం జరిగింది. 2019 మేలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పనులు పూర్తిగా నిలిపివేశారు. ఆ తరువాత వైసిపి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను కాంట్రాక్టరుకు చెల్లించింది. తిరిగిపనులు చేపడతామని చెప్పిన కాంట్రాక్టు సంస్థ 2020 నవంబరులో తిరిగి పనులు ప్రారంభించేందుకు అంగీకరించారు. ఈ మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గం మంగళదాస్ నగర్, పరమాయికుంట, ఆర్‌టిసి కాలనీలో పనులు ప్రారంభించారు. వారంపాటు పనులు చేసి మళ్లీ పనులు నిలిపివేసి వెళ్లిపోయారు. దాదాపు రెండున్నర ఏళ్లుగా పనులు ఆగిపోయినా మళ్లీ ఈ సంస్థను సంప్రదించిన నాధుడు లేరు. 10 విలీన గ్రామాల ప్రజలను కలిపి మొత్తం 10 లక్షల జనాభాకు ఈప్రాజెక్టు ఉపయోగపడుతుంది. లక్షా 45 వేల ఇళ్లకు డ్రైనేజి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. దాదాపు 70 వేల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు పైపు లైన్లు నిర్మించినా శుద్ధిప్లాంట్లు నిర్మాణం పూర్తికాకపోవడంతో అప్పట్లో కనెక్షన్లు ఇవ్వలేదు. మొత్తం 1083.72 కిలో మీటర్ల పైపు లైన్లు నిర్మించాల్సి ఉండగా 2019 ఫిబ్రవరి వరకు 505.05 కిలో మీటర్ల మేరకు పైపు లైను నిర్మించారు. 43,574 మ్యాన్ హోల్స్ నిర్మించాల్సి ఉండగా 20,376 నిర్మించారు. 27,044 ఇన్‌స్పెక్షన్ చాంబర్స్ నిర్మించాల్సి ఉండగా 12 వేల వరకూ నిర్మించారు. మొత్తంగా రూ.540 కోట్ల మేరకు పనులు జరిగాయి. గత ప్రభుత్వ హయంలో రాజకీయ వత్తిడి వల్ల పనులు వేగంగా జరగలేదన్న విమర్శలు వచ్చాయి. వైసిపి ప్రభుత్వం ఈ పనులను పూర్తిగా పక్కన పెట్టింది. అసలు ప్రాజెక్టును ఏ రూపంలోనూ పూర్తి చేయడానికి ఉన్నతాధికారులు దృష్టి పెట్టడంలేదు. ఈ ప్రాజెక్టును ఎటూ కాకుండా నిలిపివేయడం వల్ల రూ.550 కోట్ల వృధా అయినట్టేనని జిల్లా అధికారులు భావిస్తున్నారు.
యుజిడి కోసం తవ్విన గుంత (ఫైల్)