'దేశంలో ప్రజాస్వామ్యం కొరవడడానికి మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వమే కారణం. ఈ ప్రభుత్వ పాలన లోనే మానవ హక్కుల సంఘాలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల పైన, మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలపైన దాడులు జరుగుతున్నాయ'ని ప్రపంచ ప్రఖ్యాత పరిశోధనా సంస్థలు 'వి-డెమ్, ఫ్రీడమ్ హౌస్, ఇంటలిజెన్స్ యూనిట్' అధ్యయనాలు పేర్కొన్నాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం సూచికల ఆధారంగా జరిగిన ఈ అధ్యయనాలు ఫిబ్రవరి, మార్చి 2021లో ప్రచురితమయ్యాయి. స్వీడన్ కు చెందిన 'వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ (వి-డెమ్) ఇన్‌స్టిట్యూట్' భారత దేశంలో ఉన్న పరిస్థితిని ''ఎన్నికల నిరంకుశత్వం''గా పేర్కొంది. అమెరికాకు చెందిన 'ఫ్రీడమ్ హౌస్' భారతదేశంలో ''స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం'' ''పాక్షిక స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికి'' దిగజారిందంది. 'ద ఎకానమిస్ట్'కు చెందిన 'ఇంటలిజెన్స్ యూనిట్' భారతదేశంలో ''లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం'' వున్నట్టుగా పేర్కొంది.
ప్రభుత్వ పని తీరు, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, ఎన్నికల విధానం, బహుళత్వం, పౌర హక్కుల ఆధారంగా ఈ అధ్యయన నివేదికలను తయారు చేశారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని పరిణామాలు దేశంలో ప్రజాస్వామ్యం కొరవడిందని తెలియజేస్తున్నాయి. సూరత్ కేసులో ఇచ్చిన తీర్పును ఉదాహరణగా చూడవచ్చు. దర్యాప్తు చేసిన సంస్థలు నిందితులకు వ్యతిరేకంగా (జిహాదీ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి) సంతృప్తికరమైన ఏ రుజువులు చూపించనందున 122 మందిని, మాలేగావ్ కేసులో 8 మందిని నిర్దోషులుగా పరిగణిస్తూ విడుదల చేసింది. వారంతా ఐదు నుండి పందొమ్మిది సంవత్సరాల పాటు జైళ్ళలోనే మగ్గారు. నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొన్నారంటూ వారందరినీ యుఎపిఎ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద నిర్బంధించారు.
1967లో ఏర్పడిన యుఎపిఎ చట్టం పరిణామక్రమం, భారత దేశం లోని రాజకీయ మార్పులతో ముడిపడి ఉంది. కాలక్రమంలో ఎప్పటికప్పుడు ఇతర ఉగ్రవాద వ్యతిరేక చట్టాలతో కూడా ఈ చట్టం ముడిపడి ఉంది. 1985లో టెర్రరిస్టు అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (టాడా) చట్టాన్ని చేసినా....చివరకు 1995లో దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత 2002 లో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ (పోటా)ను ఆర్డినెన్సు ద్వారా చట్టం చేశారు. పోటా చట్టానికి కూడా దేశవ్యాప్తంగా బాధితులున్నారు. ఈ చట్టానికి తీవ్ర ప్రజా వ్యతిరేకత వెలువడింది. 2004లో కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే, ముందు దానిని రద్దు చేస్తామని చేసిన వాగ్దానాన్ని యుపిఎ ప్రభుత్వం అమలు చేసింది. అయితే పోటా లోని అంశాలను యుఎపిఎ లో చేర్చారు. టాడా, పోటాలను ప్రధానంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉపయోగించారు. అదే మార్గంలో యుఎపిఎ కూడా ఉంది. 2019 ఆగస్ట్ లో ఈ చట్టానికి చేసిన సవరణ ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే వ్యక్తులను ఉగ్రవాదులుగా ముద్ర వేయడం, ఉగ్రవాద సంస్థలని భావిస్తే వాటిపై నిషేధం విధించే అధికారం ప్రభుత్వానికి వుంటుంది. ఈ చట్టం కింద 42 సంస్థలపై నిషేధం విధించబడింది. యుఎపిఎ కింద నమోదైన కేసుల సంఖ్యను 2015 తో పోలిస్తే , 2019 లో 72 శాతం పెరిగాయని పార్లమెంట్‌లో హోం మంత్రిత్వ శాఖ స్వయంగా తెలిపింది. జాతీయ నేర గణాంక బ్యూరో-2016 నివేదిక ప్రకారం నమోదైన కేసులలో 67 శాతం మంది విచారణలో నిరపరాధులుగా విడుదలయ్యారు. అంటే నమోదైన కేసులలో కేవలం 33 శాతం మందికి మాత్రమే శిక్షలు ఖరారు చేశారు.
భారతదేశంలో రాజకీయ అశాంతికి కారణమైన వ్యక్తులు, సంస్థలు చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలను నిరోధించడానికంటూ ఈ యుఎపిఎ చట్టాన్ని తెచ్చారు. 2004లో ఒక సవరణ ద్వారా దానికి 'ఉగ్రవాద కార్యకలాపాలకు శిక్ష' అనే అధ్యాయాన్ని చేర్చారు. ఆ చట్టానికి వరుసగా 1972, 2004, 2008, 2012, 2019 లో సవరణలు చేశారు. ఆ సవరణ ప్రకారం వ్యక్తులను ఉగ్రవాదులుగా వర్గీకరించవచ్చు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగాను పరిగణించవచ్చు. ఉదాహరణకు... కాశ్మీర్‌లో మానవ హక్కుల గురించి ప్రశ్నిస్తే, భారతదేశ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నించినట్లుగా, పౌరసత్వ సవరణ చట్టం గురించి చేసే విమర్శను దేశం పట్ల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించవచ్చు. మేథావులు, రచయితలు, సామాజిక కార్యకర్తలైన ఆనంద్ తెల్తుందే, గౌతమ్ నవలఖ, సుధా భరద్వాజ్, ఉమర్ ఖలీద్...లాంటి వారంతా ఈ చట్టం కింద దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంటున్నారు. ఈ చట్టం కింద అరెస్ట్ అయిన వారిని ఎటువంటి చార్జిషీట్ దాఖలు చేయకుండా 180 రోజులపాటు నిర్బంధంలో ఉంచవచ్చు. చట్టం లోని సెక్షన్ 43 డి (5) ప్రకారం నేరారోపణ చేయబడిన వ్యక్తికి బెయిల్ మంజూరు కావడం అసాధ్యమైన విషయం. ఒకవేళ కోర్టు ఆ వ్యక్తిపై చేసిన ఆరోపణలు ముందుగా నిజమని భావిస్తే, బెయిల్‌ను మంజూరు చేయకుండా నిరాకరించవచ్చు. దానిననుసరించే 90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబాకు ఆరోగ్యం క్షీణిస్తున్నా బెయిల్ మంజూరు చేయడం లేదు. వీరందరిపై మోపబడిన నేరాలేవీ రుజువు కాలేదు కాబట్టి వారంతా ఏ నేరం చేయని నిరపరాధులు. అయినప్పటికీ వారిని ప్రాణాంతక కరోనా సోకిన జైల్లో వుంచారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం కింద నిరపరాధులను దీర్ఘకాలం పాటు జైల్లో పెట్టడం అప్రజాస్వామికం.
చట్టం లోని సెక్షన్ 38 ప్రకారం, నిషేధిత సంస్థకు చెందిన వ్యక్తితో మామూలుగా పరిచయం ఉన్న వ్యక్తిని కూడా నేరస్తునిగా చేర్చవచ్చు. డాక్టర్, లాయర్, జర్నలిస్టులలో ఎవరైనా అనుకోకుండా నేరారోపణ చేయబడిన వ్యక్తికి ఆహారం లేదా జీవనాధారం అందించినా ...వారిని కూడా నేరస్తులుగా భావిస్తారు. చట్టంలో నేరపూరితమైన సాహచర్యానికి, అమాయకత్వంతో కూడిన సాహచర్యానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా పేర్కొనలేదు. సెక్షన్ 43 ఎ, 43 బి లు నేరారోపణలు చేయబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి, ఇళ్ళలో సోదాలు చేయడానికి పోలీసులకు అధికారాలు కల్పిస్తాయి. రాజకీయ నాయకులు చెప్పిన విధంగా...నేరారోపణలు చేయబడిన వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడులు చేసి రుజువుకు అవసరమయ్యే వస్తువులను స్వాధీనం చేసుకుంటారు. ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వ్యక్తులను నిర్భందించేందుకు గాను కొన్ని కేసుల్లో 'సాక్ష్యాధారాలను' సైతం సృష్టిస్తారు. ఇటీవలే భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న రోనా విల్సన్ కు వ్యతిరేకంగా తన ల్యాప్‌ట్యాప్‌లో సాక్ష్యాధారాలను సృష్టించినట్లు బయటపడింది.
2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యుఎపిఎ దుర్వినియోగం సాధారణమైపోయింది. ప్రతిఘటనను అణచివేసేందుకుగాను ఇంతకు ముందున్న పాలక వర్గాల చేతిలో కూడా చట్టం ఎప్పుడూ ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉంది. రాజకీయ ఉద్యమాలను నేరపూరిత కార్యకలాపాలుగా చిత్రీకరించి, నేరం మోపేందుకు న్యాయ వ్యవస్థ నుండి అనుమతి పొందేందుకు ఇది ఒక సులభమైన సాధనం. కానీ ''ఈ చట్టం కింద హిందూత్వ శక్తుల చర్యలకు వారు ఏ విధమైన వేధింపులను ఎదుర్కొన లేదు. ఎందుకంటే వారి చర్యలు దేశ భద్రతకు హానికరం కాదని ప్రభుత్వం భావిస్తోందని'' అనుష్కా సింగ్ (ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, సెప్టెంబర్ 22, 2012) పేర్కొన్నారు. నేడు అధికారాన్ని చెలాయిస్తున్న హిందూ ఉదారవాద శక్తులు తమ రాజకీయ ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నాయి.
''యుఎపిఎ ను ఉపయోగించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా వ్యవహరిస్తోంది. దేశద్రోహం అంటే ఏమిటో సరిగా నిర్వచించకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తే అసమ్మతిని దేశద్రోహంగా పరిగణిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది ఒక హక్కు. సామాజిక మాధ్యమాలు, బహిరంగ ఉపన్యాసాలు సామాన్య ప్రజల వ్యక్తీకరణలకు సాధనాలు.'' అని మహారాష్ట్ర మాజీ ఐ.జి ఎస్.ఎమ్.ముష్రఫ్ 'ఫ్రంట్‌లైన్' పత్రిక (ఏప్రిల్ 9,2021)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ''సుధా భరద్వాజ్, వరవరరావు లాంటి ప్రముఖులు, యువకులైన ఇమామ్, ఉమర్ ఖలీద్ లాంటి వారు ప్రభుత్వ చర్యలను ప్రశ్నించినందుకు వారిపైన దేశద్రోహం, ఉగ్రవాద ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారు. ఇలాంటి ప్రభుత్వ చర్యలు ప్రస్తుత పాలనలో మాత్రమే కాదు, ఇంతకు ముందున్న ప్రభుత్వాలలో కూడా జరిగాయి. ప్రస్తుతం అసమ్మతిని ఆటంక పరిచి అదుపులో పెట్టడం ఒక నిరంతర మార్గంగా మారింది. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, కానీ వ్యవస్థ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. కులమతాల కతీతంగా ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యడం లేదన్న కారణంతో ఎవరినైనా దేశద్రోహం నేరాన్ని ఆరోపిస్తూ యుఎపిఎ కింద నిర్బంధిస్తున్నారు. ఈ చర్యలు సామాన్య ప్రజలను, మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలను కలవరపెడుతున్నాయి'' అంటారాయన. ఈ చట్టం కింద నిర్భంధించబడిన వ్యక్తి, తరువాత నిరపరాధిగా విడుదలైతే, ఏళ్ల తరబడి జైల్లో మగ్గిన తరువాత అతనికి నష్టపరిహారాన్ని చెల్లించడమేగాక, అరెస్ట్ చేసిన పోలీసుల పైన శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకు రావాలనుకుంటే, ఆ చట్టాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడద''ంటారు ముష్రఫ్.
రాజకీయ, ప్రజాస్వామిక సంక్షోభాలను రాజ్యాంగం మాత్రమే పరిష్కరించగలదన్న అంబేద్కర్ మాటల్లోని వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే రాజకీయ వ్యవస్థలు జవాబుదారీతనంతో పాటు స్వతంత్రంగా పనిచేయాలి. విస్త్రుతమైన, బలమైన రాజకీయ ఉద్యమం మాత్రమే జాతి జీవనానికి పునాదిగా ఉంటుంది.
- బోడపట్ల రవీందర్ / 'ఫ్రంట్‌లైన్' ఆధారంగా /










