Apr 27,2023 00:02

కరెక్షన్‌ మాడ్యూల్‌ ప్రారంభిస్తున్న జెసి విశ్వనాథన్‌

పట్టాల్లో సవరణ, శ్లాబ్‌ విధానంలో రిజిస్ట్రేషన్‌కు ఛాన్స్‌
కరెక్షన్‌ మాడ్యూల్‌ ప్రారంభించిన జెసి విశ్వనాథన్‌
ప్రజాశక్తి - కరాస :
యుఎల్‌సి భూములలో ఇల్లు కట్టుకుని, గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులు కన్వేయన్స్‌ డీడ్‌ పొందుటకు, అలాగే పట్టాల్లో సవరణలకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌ అన్నారు. బుధవారం గోపాలపట్నం మండలంలోని 52వ వార్డు సచివాలయంలో దీనికి సంబంధించి కరెక్షన్‌ మాడ్యూల్‌ అప్లికేషన్‌ ప్రారంభించి, వచ్చేనెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, గతంలో జిఒ్‌ 301, 388 ద్వారా పట్టాలు పొందిన హక్కుదారులు కన్వేయన్స్‌ డీడ్‌ పొందేందుకు, పట్టాల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం సవరణ జిఒలు 71,72 ఆర చేసిందన్నారు. గతంలో పట్టాలు పొంది, అవసరానుకూలంగా వాటిని అమ్ముకోవడానికి, బదలాయింపునకు వీలులేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డ లబ్ధిదారులకు ఇదొక మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అలాగే యుఎల్‌సి భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి శ్లాబ్‌ విధానంలో కన్వేయన్స్‌ డీడ్‌ పొందుటకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. 150 గజాలలోపున్న లబ్ధిదారులకు డీపట్టా ఇచ్చి, పదేళ్ల తర్వాత పూర్తి హక్కులు కల్పిస్తారన్నారు. 150 నుంచి 300 చదరపు గజాల వరకు 15శాతం కన్వేయన్స్‌ ఫీజుతోనూ, 300 నుంచి 500 గజాల వరకు 30శాతం ఫీజు, 500 చదరపు గజాలకు పైబడి ఉన్న స్థలాలకు వందశాతం కన్వేయన్స్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని, దీనికి ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు వరకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్నవారు సమీప సచివాలయంలో దరఖాస్తు పొంది వినియోగించుకోవాలని సూచించారు.