Dec 03,2022 22:25

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
         రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల నిర్మాణాలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని కమిషనర్‌ షేక్‌ షాహిద్‌ తెలిపారు. స్థానిక శనివారపుపేటలోని జగనన్న ఇళ్ల కాలనీ నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి శనివారం కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం మంజూరు చేసి పనులు చేపట్టామన్నారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో డ్రెయినేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆదేశాల మేరకు నగరంలోని 50 డివిజన్లలో పేదలందరికీ ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సొంతంగా ఇంటి నిర్మాణాలు చేపట్టే వారికి సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంట్‌, ఐరన్‌, బ్రిక్స్‌, ఇసుక అందుబాటులో ఉంచుకుని ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. శనివారపుపేట జగనన్న ఇళ్ల కాలనీలో మొత్తం 540 ఇళ్లకు గాను 108 ఇళ్లు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లు వివిధ స్థాయిల్లో ఉన్నాయని తెలిపారు. అధికారులు ప్రతిరోజూ ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించాలని కమిషనర్‌ సూచించారు. దీనిపై సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్‌ షాహిద్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ సోమశేఖర్‌, హౌసింగ్‌ ఇఇ శ్యామలారావు, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.