ఊరవతల మా వాడల్నిండా
నిప్పులు మొలుస్తున్నాయి
గాయాలు పదునెక్కుతున్నాయి
ఊపిరితీసినా ఊళ్లు తగలబెట్టినా
పిడికిలి మరింత ధైర్యాన్నిస్తూనే ఉంది
మా బిడ్డలపై మృగాల్లా విరచుకుపడి చెరచి
నింగిలో కలసిపోయిన
ఆర్తనాదాల సాక్షిగా చెబుతున్నాం
ఇక మా రంగులు మారాయి
మనువాద పడగనీడలో సామాజిక న్యాయం
హత్యచేయబడ్డదని తెలుసుకున్నాం
కుట్రల మన్‌కీబాత్‌లాపండి
కుతంత్రాల పీఠం కదిలిస్తాం
కులం పునాదుల్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం
మా జెండా అజెండా ఏంటో
మాకిపుడు స్పష్టంగా తెలిసింది
మా కళ్లు నిప్పుకణికలై వర్షిస్తున్నాయి
ఒక నేత్రం నీలార్ణవకాంతి పుంజమైతే
మరో నేత్రం ఎర్రెర్రని ప్రభాతకిరణమైంది
అరుణపతాకం మా గుండెల్లో రెెపరెపలాడుతోంది
చూపుడువేలే మాకిపుడు దారి చూపుతోంది
ఇక అగ్నిగుండాలౌతాం
బడబాగ్ని జ్వాలలై ఎగసిపడతాం
కెంగార మోహన్, కవి
9493375447