Feb 26,2022 07:16

యుద్ధంలో తొలి సత్యం విధ్వంసమే. యుద్ధ భూమి మరు భూమిగా మారుతుంది. అసంఖ్యాక ప్రజానీకానికి తీరని వ్యథను మిగుల్చుతుంది. యుద్ధంలో గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఇరు పక్షాలు తీవ్ర కష్టనష్టాలకు గురవుతాయి. యుద్ధం చేసే గాయాలు మానడానికి చాలా కాలం పడుతుంది. విశ్వం కుగ్రామమైన ఈ ఆధునిక యుగంలో ఏ మూలన ఏ చిన్నపాటి ఘర్షణ జరిగినా దాని ప్రభావం మిగతా ప్రపచమంతటిపైనా పడుతుంది. అత్యధిక ప్రజానీకం బతుకులను ఛిద్రం చేసే ఈ వినాశకర యుద్ధాలు కొందరికి మాత్రం లాభాల పంట పండిస్తాయి. యుద్ధంలో దిగిందెవరో, యుద్ధాగ్నిని రాజేస్తున్నదెవరో అర్థమైతే, యుద్ధం వల్ల లబ్ధి చేకూరేదెవరికో అవగతమవుతుంది. లిబియా, ఆఫ్గనిస్థాన్‌..ఉక్రెయిన్‌ ఇలా ఆధునిక ప్రపంచ రాజకీయ చరిత్ర అంతా యుద్ధాలతో కూడిన పెట్టుడిదారి దేశాల దురాగతాలే. అంతర్యుద్ధాలకు, యుద్ధాలకు ఆజ్యం పోసింది, పోస్తున్నదీ ఆ దేశాలే. అమెరికా నావికాదళంలో మేజర్‌ జనరల్‌గా పనిచేసి అనేక యుద్ధాల్లో రాటుదేలిన స్మెడ్లీ బట్లర్‌ (1881-1940) తన యుద్ధ అనుభవాలను వివరిస్తూ రాసిన 'వార్‌ ఈజ్‌ ఎ రాకెట్‌' పుస్తకంలో యుద్ధాలన్నిటి వెనుకా పెట్టుబడిదారుల ప్రయోజనాలే దాగివున్నాయని దాదాపు శతాబ్దం కిందటే కుండబద్దలు కొట్టారు. 30 సంవత్సరాల సైనిక జీవితమంతా పెట్టుబడిదారుల పక్షాన తాను ఒక గూండాలా పనిచేసినట్లుగా తనను తాను తిట్టిపోసుకున్నారాయన.
    మానవాళి రక్తమాంసాలను నంజుకు తింటున్నది 'లాభం' అనే పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క రాక్షస రూపమే. నాగరిక సమాజం అసహ్యించుకునేలా యుద్ధం మత్తులో మునిగి ఆయుధ కంపెనీల కోసం వెంపర్లాడుతున్న అమెరికా దురాగతపు యుద్ధోన్మాద ముఖాన్ని వికిలీక్స్‌్‌ పత్రాల్లో ప్రపంచమంతా వీక్షించింది. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా 12 దేశాలతో ఏర్పడిన ఉత్తర అట్లాంటిక్‌ సైనిక కూటమి (నాటో) నేడు 30 దేశాలకు విస్తరించింది. సభ్య దేశాలకు రక్షణ కల్పించే పేరుతో అమెరికా తన సైనిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నాటోను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నధి. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినతరువాత నాటో వంటి సైనిక కూటములు అవసరమే లేదు. ఇక విస్తరణ దేనికి? నాటోను విస్తరించడం వెనుక అమెరికన్‌ ఆయుధ కంపెనీల ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
     ఉక్రెయిన్‌ ప్రస్తుత దుస్థితికి ఈ విస్తరణవాదమే ప్రధానకారణం. మూల వాసులు, అణగారిన జాతుల సమస్యలను పరిష్కరించాల్సిన ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఆ పని చేయకపోవడంతో అక్కడ ఘర్షణాత్మక పరిస్థితులను అంతర్యుద్ధంగా రాజేసి..దానిని నాటో దేశంగా చేర్చుకోవాలని అమెరికా ఎత్తులు వేస్తోంది. రక్షణ కల్పించే పేరుతో ఉక్రెయిన్‌లో పాగా వేస్తే తూర్పు ఐరోపాపై పట్టు సాధించవచ్చునన్నది దాని పన్నాగం. ఈ పన్నాగాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. అంతమాత్రాన రష్యా చర్యను సమర్థించాల్సిన అవసరం లేదు. కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ముంచుకొచ్చిన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడంలో తమ వైపల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రష్యా పాలకులు 'ఉక్రెయిన్‌'ను ఒక అవకాశంగా మలచుకోవాలని చూస్తున్నారన్న విమర్శలను కొట్టిపారేయడానికి వీల్లేదు. మిన్క్స్‌ ఒప్పందాల ప్రకారం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. ఈ దిశగా అన్నివైపుల నుంచి ఒత్తిడి పెంచాలి. ఈ విషయంలో భారత్‌ తటస్థత పేరుతో గమ్మున ఉండడం కాకుండా నాటో బలగాల ఉపసంహరణకు ఒత్తిడి తేవాలి. రష్యాతో సంప్రదింపులు జరిపి శాంతిస్థాపనకు కృషి చేయాలి. కానీ మోడీ సర్కార్‌ ఈ పని చేయడం లేదు. భారత్‌, పాక్‌ మధ్య విద్వేషాలు తారాస్థాయికి చేరినప్పుడు నాటి సోవియట్‌ రష్యా 'తాష్కెంట్‌ ఒప్పందం' ద్వారా యుద్ధాన్ని నివారించింది. అటువంటి పాత్రను భారత్‌ ఇప్పుడు ఎందుకు పోషించదు? ఇది చేయకుండా ఉక్రెయిన్‌ను బూచిగా చూపి దేశంలో ఇంధన ధరలను పెంచడం కోసం తహతహలాడుతోంది. పెట్రో ధరలు పెరిగితే దాని ప్రభావం నిత్యావసరాల ధరలపౖౖె పడుతుంది. అది ద్రవ్యోల్బణం పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తుంది.
     ఆర్థిక సంక్షోభాల నివారణ వైపల్యాల నుంచి పాలకులను బయటపడేసే కుట్రలో భాగంగా ఒక వైపు కథనాలనే వండి వారుస్తున్న బూర్జువా మీడియా 'పెట్టుబడి' ఆకాంక్షలనే జనంపై రుద్దుతోంది. ప్రజలు ఇటువంటి ప్రచార బాకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మానవ సమాజ చరిత్రను కార్లమార్క్స్‌ మహానీయడు వర్గ పోరాటాల చరిత్రగా నిర్వచించాడు. కార్మికశక్తి ఐక్యతను విచ్ఛిన్నం చేసి లాభాలు గడించేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థ కుట్రలకు ప్రతిరూపమే యుద్ధం. ఆర్థిక అసమానతలు, సంక్షోభాలు, యుద్ధాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగం. సోషలిస్టు విప్లవాలతో వర్గ రహిత సమసమాజ నిర్మాణంతోనే యుద్ధాలకు తెర పడేది. ఆ దిశలో మానవ సమాజం పయనిస్తేనే యుద్ధం నశించి ఎల్లెడలా శాంతి కుసుమాలు వెల్లివిరుస్తాయి.