Aug 05,2022 23:08

లిటిల్‌బోరు నమూనాతో విద్యార్థుల శాంతిర్యాలీ

ప్రజాశక్తి -ములగాడ   ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలు సాగిస్తున్న యుద్దమార్గంతో విశ్వవినాశనమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ ఉండదని పిలకవానిపాలెం లక్కీ అమర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వాసుదేవరావు అన్నారు. హిరోషిమా డే సందర్భంగా శుక్రవారం పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో లిటిల్‌బోరు అణుబాంబ్‌ నమూనాతో 'యుద్ధాలు వద్దు, శాంతి ముద్దు' అనే నినాదంతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. 1945 ఆగస్ట్‌ 6న జపాన్‌పై లిటిల్‌ బోరు అనే అణుబాంబుతో అమెరికా జరిపిన దాడిలో 2,26,000 మందికి పైగా ప్రాణనష్టం, ఏడున్నర దశాబ్ధాలు గడిచినా నేటికీ కుదుటపడని వాతావరణ కాలుష్య సమస్యలు హిరోషిమా, నాగసాకి పట్టణాలను వెంటాడుతూనే ఉన్నాయన్నారు. సాంకేతికత అభివృద్ధిని కోరుకోవాలే తప్ప, యుద్ధోన్మాదం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదన్నారు.