సునామీలా విరుచుకు పడుతున్న కరోనా మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. మొదటి దశ కన్నా తీవ్ర స్థాయిలో కరోనా రెండో దశ విజృంభిస్తుండడంతో రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు, మూడు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఉధృతి ఇలాగే కొనసాగితే మే నెల మధ్య నాటికి కరోనా కేసులు రోజుకు 10 లక్షలు, మరణాలు 5 వేలకు పైగా చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కరోనా మరణాల్లో చాలా వరకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించినవే. కాబట్టి ఇవి సర్కారీ హత్యలే. గత వారం ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో 'ప్రాణవాయువు' అందక ఒక్క రోజులోనే 25 మంది చనిపోయిన ఘటన దేశంలో ప్రజారోగ్యవ్యవస్థ ఎంతటి దుస్థితిలో ఉన్నదో తెలియజేసింది. తాజాగా విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చోటుచేసుకున్న మరణాలు రాష్ట్రంలో దుస్థితికి దర్పణం పడుతున్నది. దేశంలో ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రమైన సమస్యగా మారడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మొదటి ముద్దాయి అయితే రెండవ ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వం. ఆక్సిజన్ కొరత ఇప్పటికిప్పుడు తలెత్తిన సమస్య కాదు. కరోనా మొదటి దశలోనే ఈ సమస్య తలెత్తింది. దాని నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పాఠాలు తీసుకోకపోవడాన్ని నిర్లక్ష్యమనాలా? బాధ్యతారాహిత్యమనాలా? కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో విజృంభించేదాక మొద్దు నిద్దర నటించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు పి.ఎం కేర్స్ నిధులతో జిల్లాకో ఆక్సిజన్ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రాలు అమల్లోకి వచ్చే దాకా ప్రజలు ఆక్సిజన్ కోసం ఎదురు చూడాలన్నమాట. ఇప్పుడు ప్రకటించినవి కార్య రూపం దాల్చడానికి ఎంతకాలం పడుతుందో! ఒక వైపు ఆక్సిజన్, వ్యాక్సిన్ దొరక్క ప్రజలు హాహాకారాలు చేస్తుంటే, మోడీ-అమిత్‌షా ద్వయం బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మునిగితేలారు. వీరికి ప్రజల ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయి. ప్రాణవాయువు అందక రోగులు పిట్టల్లా రాలిపోతుంటే పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ అనుమతించడం బుద్ధి వున్న ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? దీనిపై సుప్రీం కోర్టు గట్టిగా చీవాట్లు పెడితే గానీ మోడీ ప్రభుత్వంలో కదలిక లేదు. తరువాత అయినా దేశ వ్యాపితంగా ఉన్న పరిశ్రమల్లోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన వాటి సామర్థ్యాన్ని పెంచిందా అంటే అదీ లేదు. కేంద్ర ప్రభుత్వం అచేతనంగా వ్యవహరించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించి ఉండాల్సింది. కానీ, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశంలో చాలావరకు రాష్ట్రాలు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటుంటే కేరళ ఆక్సిజన్ నిల్వల్లో మిగులును ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రాధాన్యతగా భావించే ప్రజా ప్రభుత్వాలకు, ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రభుత్వాలకు తేడా ఇదే.
రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో 12 వేలు దాటాయి. ప్రతి 20 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారు. కరోనా పరీక్షా కేంద్రాలు, వ్యాక్సినేషన్ కేంద్రాలు, ఆసుపత్రుల వద్ద ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. చివరికి చనిపోయినవారిని దహనం చేసేందుకు శ్మశానాల్లో కూడా చోటు దొరకడం లేదు. మామూలుగా మూడు వేల రూపాయలకు లభించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్‌లో రూ.30 వేలకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఫీజులకు అనేక రెట్లు అధికంగా కార్పొరేట్ ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి పిండుకుంటున్నాయి. కరోనా చికిత్సకు రూ.4 లక్షల నుంచి పది లక్షల దాకా బిల్లులు వసూలు చేసిన దాఖలాలు ఉన్నాయి. సామాన్యుడికి ప్రైవేటు వైద్యం అత్యంత భారంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడక ఉంటే వెంటిలేటర్ ఉండదు, వెంటిలేటర్ ఉంటే ఆక్సిజన్ ఉండదు. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వాలి. ఒక వైపు కరోనాతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం 2023 నాటికి ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ నిరంతరాయంగా అందించడం గురించి మాట్లాడడంలో ఔచిత్యమేమిటి? ప్రాణ సంకటంతో ఉన్న ప్రజలకు ఇంటర్నెట్ ముఖ్యమా, వైద్యం ముఖ్యమా? కోవిడ్ మహమ్మారి విసిరిన సవాల్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలను, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో విఫలమైన పాలకులను ప్రజలు క్షమించరు. చరిత్ర అంతకన్నా క్షమించదు.










