May 26,2023 23:10

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ కృతికా శుక్లా


ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడ బీచ్‌ ఫ్రంట్‌ పర్యాటక అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికా రులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ కోర్టుహాల్‌లో కాకినాడ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కలెక్టర్‌ కృతికా శుక్లా పర్యాటకం, మైనింగ్‌, పంచాయతీరాజ్‌, మత్స్య, పోలీస్‌ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. స్వదేశ్‌ దర్శన్‌ స్కీంలో భాగంగా కాకినాడ బీచ్‌ ఫ్రంట్‌, హౌప్‌ ఐలాండ్‌, కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బీచ్‌ రిసార్ట్స్‌ తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. కాకినాడ బీచ్‌ ఫ్రంట్‌ అభివద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మ్యూజికల్‌ ఫౌంటైన్‌, లేజర్‌ షో, గ్లాస్‌ బ్రిడ్జ్‌ తదితరాలను సందర్శకులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. హరిత విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీచ్‌ ఫ్రంట్‌ ప్రాంతంలో అడ్వెంచర్‌, ఈవెంట్ల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యమైన వాటిలో ఒకటైన హౌప్‌ ఐలాండ్‌కు బోటింగ్‌ సేవలు, షెల్టర్లు, గెజిబోలు, నడిచే మార్గాలు తదితరాలను సుందరీకరించి పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని మరింత పర్యాటకహితంగా తీర్చిదిద్దాలని మడ అడవుల ఔన్నత్యం, ఈ ప్రాంతంలోని వన్య ప్రాణులు తదితరాల ప్రాశస్త్యాన్ని పర్యాటకులకు వివరించేలా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎకో షాపింగ్‌ రూమ్‌లను అభివద్ధి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించు కుంటూ పర్యాటక ప్రాంతాల అభివద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హౌటల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్మాణ పనులతో పాటు కాకినాడ బీచ్‌ ఫ్రంట్‌ రిసార్ట్స్‌, ఫుడ్‌కోర్ట్స్‌, హరిత బీచ్‌ రిసార్ట్స్‌, కోరింగ రిసార్ట్స్‌ తదితరాలపైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో కాకినాడ జిల్లా పర్యాటక అధికారి పి.పోశయ్య, డివిఎం సీహెచ్‌ పవన్‌ కుమార్‌, డిపిఒ ఆర్‌.విక్టర్‌, డిఎస్‌పి కె.మురళీకృష్ణారెడ్డి, జిల్లా మత్స్య అధికారి పివి సత్యనారాయణ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల పర్యాటక అధికారి పి.వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్య శాకలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలి
కాకినాడ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీల వివరాలు, ఆసుపత్రుల్లో జరుగుతున్న నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్‌ కతికా శుక్లా వైద్య అధికారులతో కలిసి సమీక్షించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. జిజిహెచ్‌, డిఎంహెచ్‌ఒ, డిఎంఇ, ఎపివివిపి విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను గుర్తించి వెంటనే నివేదికలు పంపాలని కలెక్టరు అధికారులకు ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, జిజిహెచ్‌ సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ డి.హేమలతాదేవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సనత్‌కుమారి, ఎపి ఎంఎస్‌ఐడిసి ఇఇ కె.విజ యభాస్కర్‌, డిఐఒ డాక్టర్‌ ప్రభాకర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.