ప్రజాశక్తి-తాడేపల్లి : తాడేపల్లిలో రైతుల పంట పొలాలపై విధించిన యు1 రిజర్వ్ జోన్ వెంటనే తొలగించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు కోరారు. రైతు సంఘం తాడేపల్లి విస్తృత సమావేశం తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో బుధవారం జరిగింది. శివశంకరరావు మట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా ప్రస్తుత సిఎం జగన్ తాము అధికారంలోకి వస్తే నెల రోజుల్లో జోన్ తొలగిస్తామని చెప్పిన హామీని నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. సిఆర్‌డిఎ అధికారులు రెండు శాతం భూ బదలాయంపు ఛార్జీలు చెల్లించాలంటున్నారని, ఒక్కో రైతు ఎకరాకు రూ.5.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. ఆంధ్రారత్న పంపింగ్ స్కీమ్ కాలువలో అపార్టుమెంట్ల నుంచి వస్తున్న మురుగును తొలగించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాల్వ దుర్గంధం వెదజల్లడంతో ఆ ప్రాంతంలో నివశిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భుగర్భ జలాలు కలుషితమై పొలం పనులకు వెళ్లే వ్యవసాయ కార్మికులు కూడా ఆ నీరు వాడటం వల్ల అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ఈ నెల 30వ తేదీ విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగే మహాధర్నాను జెయప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. సమావేశంలో డి.వెంకటరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, బి.గోపాల్ రెడ్డి, సిహెచ్.లక్ష్మారెడ్డి, కృష్ణ, పి.లక్ష్మణరావు పాల్గొన్నారు.










