ప్రజాశక్తి-తాడేపల్లి : తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి గ్రామాలకు చెందిన యు1 జోన్ బాధిత రైతుల్లో మళ్లీ అలజడి మొదలైంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యు ప్రకారం రెండు శాతం పన్ను చెల్లిస్తే రిజర్వ్ జోన్ ఎత్తివేస్తామని సిఆర్‌డిఎ అధికారులు 381 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నోటీస్ బోర్డులో నోటీసు అంటించారు. గురువారం నోటీసు అందుకున్న రైతుల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
యు1 జోన్ కింద ఈ మూడు గ్రామాల్లో 178 ఎకరాల భూమి ఉంది. 381 మంది రైతులకు సంబంధించి సన్న, చిన్నకారు రైతులు ఈ భూమి ఆధారపడి జీవిస్తున్నారు. గత టిడిపి ప్రభుత్వం రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకుని 178 ఎకరాలను యు1 రిజర్వ్ జోన్‌గా ప్రకటించింది. అప్పటి భూముల అమ్మకాలు, కొనుగోలు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా అనేక రైతు కుటుంబాలు తమ ఇంట్లో శుభకార్యాలకు, ఇతర అవసరాలకు తమ భూములు అమ్ముకోవాలేని పరిస్థితిలోకి నెట్టపడ్డారు. భూమి ఉందనే భరోసాతో కోట్లాది రూపాయలు అప్పులు చేసి తమ అవసరాలు తీర్చుకున్నారు. ఎప్పటికైనా రిజర్వ్ జోన్ ఎత్తేస్తారని, తమ భూములు అమ్ముకుంటే కష్టాలు గట్టెక్కుతాయని రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. టిడిపి ప్రభుత్వం పోయి వైసిపి ప్రభుత్వం వచ్చింది. రిజర్వ్ జోన్ ఎత్తివేస్తామని అప్పట్లో హామీనిచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రెండు సంవత్సరాలు తడిచినా రిజర్వ్ జోన్ ఎత్తివేయలేదు. దీంతో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. సుమారు 146 రోజులు తాడేపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయం ముందు రిలే దీక్షలకు దిగారు. ఏడాదిన్నర కిందట స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీక్షా శిబిరానికి వచ్చి నయా పైసా ఖర్చు లేకుండా రిజర్వ్ జోన్ ఎత్తివేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీనివ్వడంతో రైతులు దీక్షను విరమించారు. నాడు ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు ఎటువంటి పన్ను లేకుండా జోన్ ఎత్తివేస్తారని భావిస్తే ఈ విధంగా నోటీసులు రావడం పట్ల రైతాంగంలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీని ప్రకారం ప్రస్తుతం రైతులు రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే రుసుమేమీ చెల్లించకుండానే రిజర్వ్ జోన్ ఎత్తివేయాల్సిందేనని రైతులు కోరుతున్నారు. లేకుంటే ఒక శాతం చెల్లించడానికి రైతులు ముందుకొస్తున్నారు. అదికూడా ప్రభుత్వం నిర్ణయించిన వాల్యు ప్రకారం చెల్లిస్తామని చెబుతున్నారు.
దీనిపై యు1 రిజర్వ్ జోన్ కన్వీనర్ దొంతిరెడ్డి సాంబిరెడ్డిని సంప్రదించగా దీనిపై పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత స్పందిస్తామన్నారు. నోటీసులు అందుకున్న కొంతమంది సిఆర్‌డిఎ అధికారులను కలిశారు. అయితే రైతులకు నష్టదాయకంగా ఉన్న యు1 రిజర్వ్ జోన్ ఎత్తివేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, రూరల్ కార్యదర్శి డి.వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై చొరవ తీసుకోవాలన్నారు. ఈ భూములపై ఆధారపడ్డ సన్న, చిన్నకారు రైతులు రెండు శాతం పన్ను కట్టలేని పరిస్థితిలో ఉన్న దృష్ట్యా అవసరమైతే సిఎంతో మాట్లాడి ఎటువంటి చెల్లింపులూ లేకుండా జోన్ ఎత్తివేయడానికి కృషి చేయాలని కోరారు.










