ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కొందరు రాజకీయ నేతల అండదండలు, అధికారుల నిర్లక్ష్య వైఖరి వెరసి జిల్లాలో గంజాయి మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తోంది. పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా అక్రమ రవాణా అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మత్తుకి అలవాటు పడిన కొంతమంది యువతే లక్ష్యంగా గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. సిగరెట్లు, మద్యం తాగడం ఒక ఫ్యాషన్‌గా భావించిన కొందరు ఇప్పుడు గంజాయిని మత్తుగా ఎంజారు చేస్తున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలే కాక పట్టణ కేంద్రాల్లో కూడా గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోనే ఈ సంస్కతి చాపకిందనీరులా పెరిగిపోతోంది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. 2020లో 46 కేసుల్లో 120 మందిని అరెస్టు చేసి రూ.1.7 కోట్ల విలువైన 4,822 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 44 వాహనాలను సీజ్ చేశారు. 2021లో 63 కేసుల్లో 194 మందిని అరెస్టు చేసి రూ.6.96 కోట్ల విలువైన 15,726 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 62 వాహనాలను సీజ్ చేశారు. 2022లో 34 కేసుల్లో 94 మందిని అరెస్టు చేసి రూ.1.67 కోట్ల విలువైన 6,686 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 33 వాహనాలను సీజ్ చేసారు.
అడ్డూ అదుపు లేకుండా రవాణా
సమీపంలోని విశాఖ, మహారాష్ట్ర, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా సాగవుతోంది. అక్కడ నుంచి నుంచి జిల్లాలోకి గంజాయి రవాణా అవుతున్నట్లు తరచూ పోలీసులు గుర్తిస్తూ అరెస్టులు చేస్తున్నారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి రైలు, బస్సుమార్గం, వ్యాన్లు, ఆటోల ద్వారా దిగుమతి చేస్తున్నారు. జిల్లాలో కళాశాలల విద్యార్థులు, ఏ పనీ లేకుండా తిరుగుతున్నవారిని టార్గెట్ చేసుకుని గంజాయి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. వారికి మత్తు పదార్థాలను అలవాటు చేసి రూ.వేలల్లో సొమ్ములు దండుకుంటున్నారు. రకరకాల వ్యక్తులు ప్రయాణికుల్లా వచ్చి కొన్ని ముఖ్యమైన రైల్వేస్టేషన్లకు గంజాయి చేరుస్తున్నారు. కాకినాడ జిల్లాలో 149 కేసుల్లో పట్టుబడిన సుమారు 22 వేల కేజీల గంజాయిని గతేడాది డిసెంబర్ 23న కిర్లంపూడిలో పోలీసులు ధ్వంసం చేశారు. గత మూడు నెలల్లో కొన్ని సంఘటనలను చూస్తే జూన్ 14న కాకినాడలో గంజాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కొంత మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా గంజాయిను విశాఖ ఏజెన్సీ నుంచి కాకినాడకు తీసుకొచ్చి విక్రయిస్తున్న నలుగురిని, మరో నలుగురు బాల నేరస్తులను జూలై 1న సర్పవరం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 23 కేజీల గంజాయిను, రవాణాకు ఉపయోగిస్తున్న ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. గతనెల 4న తుని ఆర్‌టిసి కాంప్లెక్స్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని తుని పోలీసులు అరెస్టు చేసారు. సుమారు రూ.లక్ష విలువైన 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతనెల 16న గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో హల్ చల్ చేశారు. ఒపి టికెట్ లేకుండా వైద్యం ఎందుకు చేయరంటూ సిబ్బందిపై దాడి చేశారు. అవుట్ పోస్ట్ పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేయగా గంజాయి బాబులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు జేబులు సోదా చేయగా కత్తులు, గంజాయి ఉన్నట్లు గుర్తించి 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేయగా వారిని హాస్పిటల్ నుంచి స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 6న తుని పట్టణం సీతారామపురం జంక్షన్ వద్ద బస్సు దిగి వస్తున్న నలుగురిని గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద రూ.1.10 లక్షల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తుని సిఐ ఎం.గీతా రామకష్ణ తెలిపారు. ఇలా గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు సాగుతుండగా పోలీసులు తమకు సమాచారం అందిన వాటిని గుర్తిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యంత సమస్యాత్మక, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రదేశాల్లో అసాంఘిక శక్తులను పట్టుకునేందుకు ఆర్‌టిసి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది యువతను, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులకు, అసాంఘిక శక్తులను గుర్తించి విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా కౌన్సిలింగ్ చేసి, తనిఖీల అనంతరం అందరినీ హెచ్చరిస్తున్నారు.










