జిల్లాలో రెచ్చిపోతున్న అక్రమార్కులు
దర్జాగా ప్రభుత్వ భూములు కబ్జా
పట్టించుకోని అధికారులు
కోటేశ్వరదుర్గాపురం, కానుకొల్లులో బరితెగింపు
రూ.కోట్ల విలువ చేసే ఐదెకరాలు అన్యాక్రాంతం
'కొండంగి ఎత్తిపోతల' భూములదీ అదే పరిస్థితి
ప్రజలు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని దుస్థితి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు సలాంకొడుతున్నారు. దీంతో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఏలూరు మండలం కోటేశ్వర దుర్గాపురం, మండవల్లి మండలం కానుకొల్లులో దాదాపు ఐదెకరాల ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జాచేసి చేపల చెరువులుగా మార్చేస్తున్నా అడిగే నాథుడే లేకుండాపోయాడు. గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం అందరినీ అశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారుల అండదండలతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. ఏలూరు జిల్లాలో సాగుతున్న చేపల చెరువుల అక్రమ తవ్వకాలను అధికారులు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నాయకులు ఏంచేసినా తమకు ఏమీ సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మండవల్లి మండలం కానుకొల్లులో దళితుల నివాసాలకు దాదాపు 11 ఎకరాల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తి చేపల చెరువు తవ్వకం చేపట్టారు. చెరువులో పడమర వైపు 1.68 ఎకరాల ప్రభుత్వ భూమి, తూర్పు వైపు 1.64 ఎకరాలు మిలటరీ భూమి, దక్షిణంవైపు పెద్దఎత్తున పుంత పోరంబోకు భూమి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ చెరువులో దాదాపు ఐదెకరాల వరకూ ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం ఎకరం రూ.40 లక్షల వరకూ ఉంది. అంటే దాదాపు రూ.రెండున్నర కోట్లకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమించుకుని చేపల చెరువుగా మార్చేస్తున్నారు. ఈ చెరువు తవ్వకం వల్ల తాగునీటి వనరులు కలుషితం కావడమే కాకుండా దాదాపు 200 దళిత కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ చెరువుతవ్వకం నిలిపివేయాలంటూ స్థానిక ప్రజానీకం పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. చెరువుకు అనుమతులు ఇచ్చేసమయంలో స్థానిక రెవెన్యూ అధికారులు అక్కడ ప్రభుత్వ భూమి ఉందో లేదో కూడా కనీస పరిశీలన చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికార పార్టీనేతలైతే చాలు ఇక నిబంధనలతో పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. కలిదిండి మండలం కొండంగిలో ఎత్తిపోతల పథకానికి చెందిన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసి చేపల చెరువు తవ్వకం సాగించే దుర్మార్గపు చర్యలు సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.
కోటేశ్వర దుర్గాపురంలో సీలింగ్ భూమి కబ్జా
ఏలూరు మండలం కోటేశ్వర దుర్గాపురంలోనూ ప్రభుత్వ సీలింగ్ భూమిని కబ్జా చేసి చేపల చెరువుగా మార్చేస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇక్కడ తవ్వుతున్న ఆరు ఎకరాల చేపల చెరువులో 1.50 ఎకరాలు సీలింగ్ భూమి ఉంది. ఈ చెరువు తవ్వకానికి ఎలాంటి అనుతులూ లేవని స్పష్టంగా తెలుస్తోంది. ఈ అక్రమ చేపల చెరువు తవ్వకంపై స్థానికులు ఫిర్యాదు చేయగా అధికారులు గట్లకు గండ్లు సైతం కొట్టారు. ఇదంతా తూతూమంత్రంగా జరిగినట్లు చూసిన వాళ్లందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ భూమి కబ్జా చేసి చేపల చెరువు తవ్వకం సాగుతుంటే ఆ వ్యక్తిపై కేసు పెట్టి చర్యలు తీసుకోకుండా, చెరువు గట్లకు గండికొండి మమ అనిపించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. బహిరంగంగానే చేపల చెరువు తవ్వకం జరుగుతున్నా తమ దృష్టికి రాలేదేన్నట్లు అధికారులు మాట్లాడుతున్న తీరు హాస్యాస్పందంగా ఉంది. అక్రమార్కులకు అధికారులే కొమ్ముకాస్తున్నారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ భూములను అక్రమార్కులకు ధారదత్తంగా అధికారులే కట్టబెడుతున్న తీరు అత్యంత దారుణమని చెప్పొచ్చు. ఏలూరు జిల్లాలోని కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఈ విధమైన ఘటనలు అనేకం ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే వెలుగుచూస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ప్రస్తుతం పెద్దఎత్తున భూపోరాటం జరుగుతున్న దెందులూరు మండలం దోసపాడులో గతంలో ఇదేవిధంగా పేదలకు చెందిన సీలింగ్, అసైన్డ్ భూముల్లో అక్రమంగా చేపల చెరువుల తవ్వకాలు చేపట్టారు. నేడు అదేతరహాలో కొల్లేరును ఆనుకుని ఉన్న మండలాల్లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జాచేసి చేపల చెరువులుగా తవ్వేస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమ చేపల చెరువులకోసం కబ్జాచేసిన ప్రభుత్వ భూములను కాపాడాలని అంతాకోరుతున్నారు.










