
ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలో కృష్ణదేవిపేట పాఠశాల ప్రహరీ గోడను ఆనుకొని అక్రమ కట్టడాల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇది గుర్తించిన అధికారులు మూడు నెలలు క్రితం తొలగించాలంటూ నోటీసులు జారీ చేశారే తప్ప పట్టించుకోలేదు. దీంతో అక్రమ కట్టడాలు మరింత జోరందుకున్నాయి. ఫలితంగా తారు రోడ్డు రోజురోజుకు కుచించుకుపోతోంది. ఈ రహదారిపై రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాల ప్రహరీపై చక్కని బొమ్మలు వేసేందుకు ఈ అక్రమ నిర్మాణాలు తొలగించాలని పేరెంట్స్ కమిటీ సభ్యులు పంచాయతీ, అర్‌అండ్‌బీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయా శాఖల అధికారులు నోటీసులతో సరిపెట్టుకోవడంతో కొంతమంది ఇప్పటి వరకు ఉన్న బడ్డీల స్థానంలో పునాదులు వేసి భవన నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగుచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి కిరణ్మయిని వివరణ కోరగా ఆక్రమణలకు గురవు తున్న స్థలం రహదారులు, భవనాల శాఖకు చెందిందని తెలిపారు. ఆక్రమణలపై ఆర్ అండ్‌బి అధికారులకు సమాచారం అందించామన్నారు. సోమవారం ఆక్రమణదారులతో మాట్లాడి వాటిని తొలగిస్తామని అధికారులు చెప్పినట్లుగా ఆమె తెలిపారు.