Jan 01,2023 23:33

యండపల్లివలస గ్రామంలో అక్రమంగా చేపడుతున్న గృహ నిర్మాణం

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:మండలంలోని పద్మాపురం పంచాయతీ యండపల్లివలస మెయిన్‌ రోడ్డు పక్కన గిరిజనేతరులు అక్రమ కట్టడాలు రోజురోజుకు పెరుగుతున్నా మండల రెవెన్యూ అధికారులు, పంచాయితీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టం, పీసా చట్టం ఇతర గిరిజన చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు అక్రమ కట్టడాలు చేపడుతున్నా నిలుపుదల చేయవలసిన అధికారులు వారికి కొమ్ము కొమ్ము కాస్తున్నారు. అనుమతి లేకుండా నివాస గృహాలు, దుకాణాలు, బినామీల పేరిట లాడ్జీలను నిర్మిస్తున్నారు. మూడు, నాలుగు అంతస్తుల భవనాలు నిర్మించుకుంటున్నా రెవిన్యూ, పంచాయతి అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో గిరిజనేతరులు మరింతగా రెచ్చి పోయి యండపల్లివలస ప్రాంతంలో జోరుగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. యండపల్లివలస ప్రధాన రహదారుల పక్కన కెనరా బ్యాంకు ఏటిఎం దగ్గర నుండి మీ సేవ దగ్గర, రైల్వే క్వార్టర్స్‌ పక్కన వరకు గిరిజనేతరులు పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై గతంలో పంచాయతీ ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు ధర్నాలు, ఫిర్యాదులు చేసినపట్టికి రెవెన్యూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అరకు మండల కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్‌ కళాశాల బార్సు హాస్టల్‌ వెనుకాల సీ కోలనిలో ఇద్దరు గిరిజనేతరులు షాపు, భవనం నిర్మాణం చేపడుతున్నా అధికారులు పట్టించు కోలేదు. గతంలో మండల తహసిల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఓ గిరిజనుడు చిన్న బడ్డి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటే రెవెన్యూ అధికారులు హుటాహుటిన తొలగిస్తున్నారు. అదే గిరిజనే తరులు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించ లేదు. గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ భవనాలు, దుకాణాలు లాడ్జిలపై చర్యలు తీసుకోవాలని గిరిజన, ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.