వీధి కాలువలను ఆక్రమించి దుకాణాల నిర్మాణం
ఏజెన్సీ చట్టాలకు గిరిజనేతరుల తూట్లు
చోద్యం చూస్తూ పట్టించుకోని అధికారులు
తక్షణ చర్యలకు సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి డుంబ్రిగూడ: మేజర్ పంచాయతీ కేంద్రం అరకు సంతబయలులో, నేరేడువలస వీధిలో గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి, గిరిజనేతరులు విచ్చలవిడిగా పబ్లిక్ స్థలాలను సైతం ఆక్రమించుకుని శాశ్వత గహ నిర్మాణాలను చేస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డుకట్టలేకపోగా, వ వారు మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
గిరిజన ప్రాంతంలో 1/70 భూబదలాయింపు చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టే హక్కు లేదు. అలాంటిది అరకు సంతబయలులోని నేరేడువలస వీధిలో ఓ గిరిజనేతరుడు ఇప్పటికే శాశ్వత గృహ నిర్మాణం చేసుకోగా, ఇపుడు ఆ ఇంటికి ఎదురుగానున్న పబ్లిక్‌గా వీధి కాలువను సైతం ఆక్రమించుకుని రెండు శాశ్వత దుకాణాలను నిర్మిస్తున్నాడు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి గిరిజనేతరుల అకమ కట్టడాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
అధికారులు తొలగించకపోతే మేమే కూల్చేస్తా
అరకు పంచాయతీలో గిరిజనేతరుల అక్రమ కట్టడంపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి తొలగించకపోతే తామే స్థానిక ప్రజలతో కలిసి కూల్చేస్తామని స్థానికమండల సిపిఎం నాయకుడు, మాజీ సర్పంచ్ పి.సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. నేరేడువలస వీధిలో కోరుకొండ వెంకట్రావు అనే గిరిజనేతరుడు వీధి కాలువను సైతం దర్జాగా ఆక్రమించి రెండు దుకాణాలను నిర్మిస్తున్నా అధికారులకు కనిపించడం లేదాయని ప్రశ్నించారు. బినామీ పేర్లతో పంచాయితీ అధికారులు, స్థానిక నాయకులే వారికి ఎల్‌పిసిలు జారీచేయడం శోచనీయమని, తక్షణమే దీనిపై చర్యలు తీసుకోకుంటే, తామే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకుడు పి సత్యనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలి :గిరిజన సంఘం
హుకుంపేట: 1/70, ఇతర గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ మండల కేంద్రంలో ఇష్టారాజ్యంగా సాగుతున్న గిరిజనేతరుల అక్రమ భూదందా, కట్టడాలపై దృష్టి పెట్టి, వాటికి అడ్డుకట్ట వేయాలని గిరిజనసంఘం కార్యదర్శి తాపూల కృష్ణారావు విమర్శించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 1/70 భూబదలాయింపు చట్టాన్ని కూడా తమకు అనుకూలంగా మలచుకుని, బినామీల సాయంతో గిరిజనేతులకు విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని, దీన్ని నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కొంతమంది దళారీలు, బినామీలు గిరిజనేతరులకు అండగా నిలిచి దందాలకు సహకరించడం దారుణమని, ఇదే పరిస్థితి కొనసాగితే, ఐదవ షెడ్యూల్డ్ భూభాగం కనుమరగవ్వడం ఖాయమన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆదివాసీల మద్దతుతో గిరిజన సంఘం అధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.










