Jan 16,2023 22:17

ప్రజాశక్తి-కంచికచర్ల: కంచికచర్ల మండలంలో కోడి పందేలు మూడు రోజులు పాట యథేచ్చగా సాగాయి. మండలంలోని గండేపల్లి వద్ద మామిడి తోటల్లో, కీసర గండేపల్లి గ్రామాల వరిధిలో పొలిమేరలో ఏర్పాటు చేసిన బరి వద్ద పందెం రాయుళ్లతో తిరునాళ్లను తలపించింది. బరుల నిర్వాహకులు అధికార పార్టీ నాయకులే కావడంతో వారి దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గండేపల్లిలో బరి వద్ద క్యాసినోకు మించిన పేకాట, కోతముక్క, లోనాబయటా లాంటి గ్యాంబ్లింగ్‌ పెద్ద ఎత్తున సాగింది. కొద్ది నిమిషాల్లోనే గ్యాంబ్లింగ్‌లో వేలకు వేలు పోగొట్టుకున్న బాధితులు లబోదిబోమన్నారు. ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి ఉండటాన్ని గమనించిన గ్యాంబ్లింగ్‌ నిర్వాహకులు అమాయకులను మోసం చేసి లక్ష రూపాయలకు పైగా దోచుకున్నారు. కొద్ది సేపటి తర్వాత మేలుకున్న బాధితులు మోసం చేశారని నిర్వాహకులను నిలదీశారు. దీంతో గ్యాంబ్లింగ్‌ నిర్వాహకులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు బాధిత బంధువులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా బరుల వైపు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కన్నెత్తి చూడలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ మూడు రోజుల్లో రూ.3 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని శాంతినగర్‌, తోరగుంటపాలెం, బార్సు హైస్కూల్‌ సమీపంలోని సత్యనారాయణపురం, తిరుమలగిరి, షేర్‌మహమ్మద్‌పేట, అనుమంచిపల్లి, బూదవాడ గ్రామాల్లో కోడిపందేలు, పేకాట, గుండ్లాట జోరుగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుండి కూడా పందెం రాయుళ్లు తరలివచ్చారు.