ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ప్రజాశక్తి - ఉండి
జిల్లాలో విభిన్నరంగాల్లో తనదైన శైలిలో గొప్పముద్ర వేసిన మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి అంత్యక్రియలను గురువారం ఆయన స్వగ్రామం ఉండి మండలం ఉప్పులూరులో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. తొలుత ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ హాజరై యర్రా నారాయణస్వామికి నివాళులర్పించారు. అనంతరం కొట్టు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నారాయణస్వామి ప్రతిఒక్కరితో ఎంతో ఆప్యాయంగా మెలిగేవారన్నారు. తన రాజకీయ జీవితంలో ప్రతిపక్షాలతో హుందాగా ప్రవర్తించేవారని, అటువంటి వ్యక్తి మరణం తీరనిలోటు అని అన్నారు. ఆయన కుమారులు నవీన్, సూర్యచంద్రరావుకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భీమవరం ఆర్‌డిఒ దాసి రాజు ఆధ్వర్యంలో నారాయణస్వామి భౌతికకాయంపై జాతీయ జెండాను ఉంచి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. డిఎస్‌పి ఎంవివి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎఆర్ బెటాలియన్ గాల్లోకి మూడు రౌండ్లు కాల్చి గౌరవ వందనం సమర్పించారు. రాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలొచ్చి తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికారు.
నారాయణస్వామి పేరిట రైతు సంక్షేమ పథకం
టిడిపి నేతలు వెల్లడి
తాము అధికారంలోకొచ్చాక రైతులకు అందించే సంక్షేమ పథకాల్లో ఒక దానికి మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి పేరు పెడతామని మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం ఉప్పులూరులో యర్రా నారాయణస్వామి భౌతికకాయంపై టిడిపి జెండా కప్పి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుల్లారావు, చినరాజప్పతోపాటు టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి నారాయణస్వామి అందించిన సేవలు ఎనలేనివన్నారు. 2024లో తమ ప్రభుత్వం ఏర్పడుతుందని, రైతాంగానికి మేలు చేకూర్చే ఒక పథకానికి నారాయణస్వామి పేరు పెడతామని పార్టీ అధినేత చంద్రబాబు చెప్పమన్నారని తెలిపారు.
నివాళులర్పించిన సిపిఎం నేతలు
మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి భౌతికకాయాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, నేతలు చింతకాయల బాబూరావు, జెఎన్‌వి.గోపాలన్, రంగారావు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ నారాయణస్వామి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా మెలిగే వారన్నారు.
పలువురు ప్రముఖుల సంతాపం
నారాయణస్వామికి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు, మాజీ ఎంఎల్‌ఎలు వి.శివరామరాజు, చింతమనేని ప్రభాకర్, ఎంఎల్‌ఎలు నిమ్మల రామానాయుడు, పుప్పాల వాసుబాబు, ఎంఎల్‌సి వంక రవీంద్రనాథ్, మాజీ మంత్రి, కాపు సంక్షేమసేన వ్యవస్థాపకులు చేగొండి హరిరామజోగయ్య, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, టిడిపి సీనియర్ నేత మెంటే పార్థసారథి, పాతపాటి వాసు, అధికారులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో సందర్శించి నివాళులర్పించారు.
యర్రా మృతి రైతాంగానికి తీరని లోటు
రైతు కార్యాచరణ సమితి నేత మంతెన రవివర్మ
మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి మృతి రైతాంగానికి తీరని లోటని రైతు కార్యాచరణ సమితి నేత మంతెన రవివర్మ అన్నారు. నారాయణస్వామి భౌతికకాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవివర్మ మాట్లాడుతూ జమిందారీ కుటుంబంలో జన్మించిన నారాయణస్వామి అన్నదాతల సంక్షేమానికి అలుపెరుగని కృషి చేశారన్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం, కొవ్వాడ రిజర్వాయర్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఆయన వెంట నేతలు అడ్డాల వాసుదేవరావు, తమ్మినీడి నాగేశ్వరరావు, గోపిశెట్టి మురళీకృష్ణారావు ఉన్నారు.










