లక్నో : యుపి అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ సీటు అత్యంత కీలక పోరుకి సిద్ధమైంది. ఈ నియోజకవర్గంలో మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి యోగి మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి పోటీచేస్తున్నారు. ఇదే స్థానంనుండి సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) నుండి మాజీ బిజెపి అభ్యర్థి, ఉపేంద్ర దత్ శుక్లా భార్య శుభావతి శుక్లా బరిలోకి దిగుతున్నారు. ఉపేంద్ర దత్‌కి యోగితో విబేధాలు ఉన్నట్లు సమాచారం. దీంతో యోగిపై పోటీగా ఆయన భార్యను ఎస్‌పి బరిలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా చేతనా పాండేను బరిలోకి దింపగా.. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) నుండి మొదటి సారిగా ఖ్వాజా శంసుద్దీన్ పోటీ పడుతున్నారు. పశ్చిమ యుపిలో ప్రముఖ యువ దళిత నేత అయిన చంద్ర శేఖర్ ఆజాద్ రావణ్ -ఆజాద్ సమాజ్ పార్టీ నుండి యోగిపై పోటీకి దిగారు. లాండ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 26 ఏళ్లుగా ముజఫర్‌నగర్‌లో ధర్నా చేస్తున్న అవినీతి వ్యతిరేక కార్యకర్త విజయ్ సింగ్ కూడా ఇదే స్థానం నుండి పోటీ పడవచ్చని సమాచారం. ఇటీవల యోగిపై తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానని విజరు సింగ్ జాతీయ మీడియాతో పేర్కొన్నారు.
అయితే వీరందరి కన్నా శుభావతి శుక్లా, యోగిల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. శుభావతి శుక్లా భర్త ఉపేంద్ర దత్ శుక్లా 2020లో గుండెపోటుతో మరణించారు. గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో బిజెపిని క్షేత్రస్థాయి నుండి పటిష్టం చేసేందుకు 40 ఏళ్ల పాటు కృషిచేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే మూడు సార్లు అసెంబ్లీ స్థానాలకు, లోక్‌సభ స్థానానికి పోటీ పడినప్పటికీ విజయం సాధించలేదు. యోగి కారణంగానే ఉపేంద్ర ఓడిపోయారంటూ ఆవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉపేంద్రదత్ భార్య రాజకీయాలకు దూరంగా పూర్తిగా ఇంటికే పరిమితమవడంతో ఆయన కుమారుడు అమిత్ దత్ శుక్లా గోరఖ్‌పూర్ రూరల్ స్థానంలో టికెట్‌ని ఆశించారు. అయితే బిజెపి అతన్ని పక్కన పెట్టడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో శుభావతి శుక్లా, అమిత్‌శుక్లాలు ఈ ఏడాది జనవరిలో ఎస్‌పిలో చేరారు. బిజెపి ఏకీకృత (ఠాకూర్-బ్రాహ్మణుల )ఓటు బ్యాంకును చీల్చేందుకు అఖిలేష్‌యాదవ్ శుభావతిని ఎంచుకున్నట్లు అక్కడి వర్గాలు భావిస్తున్నాయి. గోరఖ్‌పూర్‌తో పాటు పూర్వాంచల్‌లోని బ్రాహ్మణ వర్గాల్లో ఉపేంద్ర శుక్లాకి మంచి పట్టు ఉంది. క్షేత్రస్థాయిలో బిజెపిని నిలబెట్టేందుకు కృషి చేసినప్పటికీ ఉపేంద్ర మరణించిన అనంతరం బిజెపి పక్కన పెట్టడం, యోగి పట్ల బ్రాహ్మణ వర్గాల్లో అసంతృప్తి నెలకొనడం తమ పార్టీకి అనుకూలంగా మారవచ్చని అఖిలేష్ భావిస్తున్నారు. ఉపేంద్ర శుక్లా కుటుంబానికి వచ్చే సానుభూతి ఓట్లను దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో శుభావతి శుక్లాని ఈ స్థానం నుండి బరిలోకి దింపినట్లు గోరఖ్‌పూర్ సర్కిల్స్ పేర్కొంటున్నాయి. దీంతో ఆమె యోగికి గట్టి పోటీ కావచ్చని ఆ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఏడు దశల యుపి అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.










