ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వానికి ఉన్నఫళంగా తమ రాష్ట్రంలో జనాభాను తగ్గించాలన్న ఆలోచన వచ్చింది. యు.పి పాపులేషన్ బిల్లు (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమం)-2021 ముసాయిదాను రూపొందించిన లా కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి ఈ నెల 19 లోపు ప్రజాభిప్రాయం కోరింది. ఆగస్టులో అసెంబ్లీలో బిల్లుకు చట్ట రూపం ఇవ్వనుంది. కాగా ముసాయిదాలో పేర్కొన్న అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. ఇప్పటికే ఉద్యోగం పొందితే వారికి పదోన్నతులు ఇవ్వరు. సంక్షేమ పథకాలు బంద్ అవుతాయి. స్థానిక ఎన్నికల్లో పాల్గొనే వీలుండదు. ఇద్దరు, ఒక్కరికే పరిమితం అయ్యే వారికి ప్రోత్సాహకాలూ బిల్లులో ఉన్నాయి. అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే, రేషన్ కార్డులో నలుగురి కంటే ఎక్కువ ఉండటానికి అనుమతి లేకపోవడం. ఆర్‌ఎస్‌ఎస్ మానస పుత్రుడు, ప్రధాని మోడీకి అత్యంత ఇష్టుడూ అయిన యోగికి, ఆదరాబాదరాగా, అదీ వచ్చే ఏడాది యు.పి అసెంబ్లీ ఎన్నికల ముంగిట వివాదాస్పద జనాభా నియంత్రణ చట్టం తెచ్చే అగత్యమేం వచ్చి పడింది ?
యు.పి లో ఇప్పటికిప్పుడు ప్రత్యేక చట్టం ద్వారా జనాభాను నియంత్రించాల్సిన అవసరమేమీ లేదు. విస్తీర్ణం రీత్యా 23 కోట్ల జనాభాతో దేశంలో అతి పెద్ద రాష్ట్రమైనప్పటికీ ఈ కాలంలో అక్కడ సంతానోత్పత్తి రేటు అదుపులోనే ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2015-16లో వెల్లడించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) నివేదిక మేరకు యు.పి లో సంతానోత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేటు-టిఎఫ్‌ఆర్) గడచిన దశాబ్దంలో 3.8 నుండి 2.7కి తగ్గింది. దేశ సగటుకు దగ్గరగానే ఉంది. 2018లో శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ప్రకారం టిఎఫ్‌ఆర్ స్వల్పంగా 2.9కి పెరిగింది. ఎలాంటి ప్రత్యేక నిర్బంధ చర్యలూ లేకుండానే ఈ తగ్గుదల సాధ్యపడింది. ఇప్పుడు యోగి సర్కారు ప్రత్యేక చట్టం ద్వారా ప్రజలపై పలు ఆంక్షలను బలవంతంగా రుద్ది 2030 నాటికి టిఎఫ్‌ఆర్ 1.7కి తగ్గిస్తామనడం దేనికి? జనాభా కట్టడి చట్టం ప్రజల జీవితాలను నియంత్రిస్తుంది. విపత్తులా పరిణమిస్తుంది. యు.పి గ్రామాల్లో టిఎఫ్‌ఆర్ 3 శాతం కాగా నగరాల్లో 2.1 శాతం. ప్రభుత్వ జనాభా నియంత్రణ చర్యలు ప్రజలు, ప్రాంతాల అసమానతలు సృష్టిస్తుంది. పాఠశాల విద్య, ప్రజారోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాలకు, సామాజిక విఘాతానికి కారణమవుతుంది. జనాభాను తగ్గించాలంటే అందుకు ప్రజల్లో ప్రచారం చేసి, వారి చైతన్యాన్ని అభివృద్ధి చేయాలి. అంతే తప్ప నిర్బంధ చట్టాలు తేవడం నిరంకుశం. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన ఘటనలను ఈ చర్య గుర్తుకు తెస్తోంది.
యు.పి లో కొన్ని దశాబ్దాల విరామానంతరం సంఫ్‌ు పరివారం, మోడీ-షా తమ 'సహజ సిద్ధాంత' ఎత్తుగడలన్నీ రంగరించిన ఫలితంగా బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుంది. యు.పి లో ప్రధాన ప్రతిపక్షాల మధ్య అనైక్యత కారణంగానే బిజెపి గెలవగలిగిందన్నది వాస్తవం. యోగి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు, విద్వేష విద్రోహాలు తప్ప చేసిందేమీ లేదు. కరోనా కట్టడిలో యోగి సర్కారు ఘోరంగా విఫలమైందన్న ఆగ్రహం ప్రజలతో పాటు స్వపక్షంలోనూ వ్యక్తమవుతోంది. యోగిని పదవి నుండి తప్పిస్తారనుకోగా ప్రస్తుతానికి అధిష్టానం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. మొన్న మంత్రి వర్గ విస్తరణలో యు.పి కి ఏకంగా ఏడు పదవులు కేటాయించడం వెనుక అసెంబ్లీ ఎన్నికల తంత్రం ఉంది. ఈ చర్యలతో పాటు ముస్లింలే లక్ష్యంగా, హిందువుల ఓట్లకు గాలం వేసేందుకు అకస్మాత్తుగా పాపులేషన్ బిల్లును తెర మీదికి తెచ్చిందన్నది దాచినా దాగని సత్యం. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఇలాంటి పాచికలనే బిజెపి వేస్తోంది. నిన్న బెంగాల్‌లో, అస్సాంలో అక్రమ చొరబాట్లు, ఎన్‌ఆర్‌సి వంటి విద్వేషాలను రెచ్చగొట్టింది. అధికారం కోసం ప్రజల మధ్య చీలికలు పెట్టడానికి బిజెపి వెనుకాడదని దాని చరిత్ర ఇప్పటికే తేటతెల్లం చేసింది. ఆ పూర్వరంగంలో యు.పి జనాభా బిల్లు ఎందుకో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. బిజెపి విద్వేష వ్యూహాన్ని తిప్పికొట్టక మానరు.










