న్యూఢిల్లీ : యోగి ఆదిత్యనాథ్ 80 శాతం vs 20 శాతం వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌పవార్ విరుచుకుపడ్డారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇటువంటి వ్యాఖ్యలను కచ్చితంగా ఖండించాలని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 80 శాతం vs 20 శాతం వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, వారిలో పాతుకుపోయిన మత విశ్వాసాలకు ఇవి నిదర్శనమని అన్నారు. దేశంలో ఐక్యత, సహనాన్ని కొనసాగించాలంటే మత విద్వేషాలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలను కచ్చితంగా ఖండించాల్సిందేనని అన్నారు. ఈసారి యుపి ప్రజలు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యుపిలో ఎన్నికలు 80 శాతం 20 శాతం మధ్య జరుగుతున్నట్లు ఉన్నాయని 'కిత్నా బదలా యుపి' పేరుతో రెండు రోజుల దూరదర్శన్ సదస్సు చివరిరోజున యుపి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. యుపి ఓటర్లలో ముస్లింలు 20 శాతంగా ఉన్నారు. దీంతో ముస్లింలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 80 శాతం పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళుతుంటే .. ఈ 20 శాతం మంది ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారని, వ్యతిరేకులుగానే మిగులుతారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని, సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. యుపిలో సమాజ్‌వాది పార్టీతో ఎన్‌సిపి చేతులు కలుపుతామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ కూటమి భాగస్వామిగా పోటీ చేస్తామని ఎన్‌సిపి ప్రకటించింది.
యుపి ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని, అధికార బిజెపిని ఓడించేందుకే పలు రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వస్తున్నాయని అన్నారు. యుపిలో సమాజ్‌వాది పార్టీతో సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో భావసారూప్యత గల పార్టీలన్నీ కలిసి సమావేశం కానున్నాయని,. సీట్ల పంపకంపై చర్చ జరుగుతుందని అన్నారు. తమ పార్టీ ఎస్‌పితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతీయ పార్టీలతో అధికారికంగా పొత్తు కుదుర్చుకుంటుందని శరద్ పవార్ ప్రకటించారు. బిజెపి ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా నెరవేర్చలేదని యుపి ప్రజలు గ్రహించారని, అందుకే మార్పు తప్పదని అన్నారు. మణిపూర్‌లో ఎన్‌సిపి ఐదు స్థానాల్లో పోటీ చేస్తుందని, గోవాలో శివసేన, తృణమూల్ కాంగ్రెస్‌లతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.










