Nov 13,2022 23:04

ప్రధమస్థానంలో నిలిచిన విశాఖ యోగా క్రీడాకారులు

రెండో స్థానంలో నెల్లూరు
మూడో స్థానంలో కష్ణా, కర్నూలు జట్లు
ప్రజాశక్తి -భీమునిపట్నం :
స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన 47వ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌ షిప్‌ -2022 యోగాసన పోటీలలో విశాఖ జిల్లా క్రీడాకారులు మొదటిస్థానంలో నిలిచారు. శనివారం ప్రారంభమై, ఆదివారంతో ముగిసిన ఈ పోటీల్లో ఉమ్మడి రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొని, యోగాసనాల్లో తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు.
59పాయింట్లతో విశాఖ టాప్‌
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో 59 పాయింట్లతో మొదటి స్థానంలో విశాఖ జట్టు నిలిచింది.22 పాయింట్లతో నెల్లూరు రెండోస్థానంలోనూ, 21పాయింట్లతో మూడో స్థానంలో కష్ణా, కర్నూలు జిల్లాల జట్లు సమ ఉజ్జీలుగా మూడోస్థానంలో నిలిచాయి. జట్టుపరంగానూ, వ్యక్తిగతంగా ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు 2023 జనవరి 13-17 తేదీల్లో తమిళనాడులోని తిరుమన్నామలైలో జరుగనున్న జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
ఔ రా అనేలా ప్రతిభ కనబరిచిన శిరీష
విభిన్న రీతుల్లో యోగాసనాలు వేస్తూ అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఇప్పటికే పలు బంగారు, వెండిపతకాలు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టి శిరీష, ఈ పోటీల్లోనూ ఔరా అనిపించేలా వేదికపై పలు భంగిమల్లో యోగాసనాలు ప్రదర్శించారు. శిరీష ప్రతిభను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.
రాష్ట్ర యోగా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 2,3 వార్డుల వైసిపి ఇన్‌ఛార్జిలు ఎస్‌ కరుణాకరరెడ్డి, మైలపల్లి షణ్ముఖరావు, మాజీ కౌన్సిలర్‌ ఎం.లక్ష్మణరావు, సెయింట్‌ ఆన్స్‌ పాఠశాల కో ఆర్డినేటర్‌ సిస్టర్‌ థెరీసా మేరీ , యోగా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిహెచ్‌ఎఆర్‌కె వర్మ, ప్రధాన కార్యదర్శి అవినాష్‌, జిల్లా అధ్యక్షులు రవి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ యు రామారావు, ఎస్‌జిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ వెంకటరెడ్డి, పాఠశాల పిఇటి ఎన్‌ శ్రీను పాల్గొన్నారు.