Jul 14,2023 21:15

సమావేశంలో మాట్లాడుతున్న జెసి రాజకుమారి

ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని ఈనెల 20న ఎంఇఒ కార్యాలయాల నుండి ప్రభుత్వ పాఠశాలలకు సెమిస్టర్‌-2 పాఠ్యపుస్తకాలు ఎమ్‌డియు వాహనాల ద్వారా సరఫరా చేయాల్సి ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి తెలిపారు. పౌర సరఫరాల విభాగం, పౌర సరఫరాల సంస్థ పనితీరు, ఇతర అంశాలపై జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి డిఆర్‌సి హాల్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. పాఠ్యపుస్తకాల సరఫరాకు సంబంధించి ఇప్పటికే తహశీల్దార్లకు ఆదేశాలు అందాయని, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. గర్భిణులు, బాలింతలకు ఆగస్టు నుండి టేక్‌ హోం రేషన్‌ పంపిణీకి మహిళా శిశు సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారన్నారు. పౌర సరఫరాల సిబ్బందికి ఫోర్టిపైడ్‌ బియ్యం గురించి కార్డు దారులకు విస్తత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫోర్టిపైడ్‌ బియ్యం కిలో రూ.40లు వెచ్చించి, ప్రభుత్వం కార్డుదారుల ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నందున కార్డుదారులు తమ సొంత అవసరాలకు వినియోగించుకోవాలని, ఏవరికీ అమ్మవద్దని కోరారు. పిడిఎస్‌ బియ్యం కొన్నా, అమ్మినా చట్టరీత్యా నేరమన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలిపద్మ, జిల్లా మేనేజరు జి.లక్ష్మి, తూనికలు కొలతలు శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.