May 26,2023 01:27
బాపట్ల జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న కృష్ణ మాదిగ

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల జిల్లా యద్దనపూడిలో దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ను కోరారు. మంగళవారం యద్దనపూడి దళిత బాధిత కుటుంబాలతో కలసి అమరావతి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాపట్ల ఎస్పీకి యద్దనపూడి దళితుల సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కృష్ణ మాదిగ మాట్లాడుతూ యద్దనపూడి గ్రామంలో దళిత వాడకు చెందిన మున్నంగి వీరయ్య.. అగ్రవర్ణ కులానికి చెందిన జి సాంబయ్య మధ్య ప్రభుత్వ రేషన్‌ పంపిణీ అంశంపై జరిగిన వివాదం దాడులు, ప్రతిదాడులకు దారితీసింది. దాడి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. న్యాయ విచారణ చేసి దోషులను వెంటనే అరెస్ట్‌ చేయాలని కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. రాజకీయ పార్టీలు దళితులపక్షాన అండగా లేకుండా అగ్రకులాల వారికే మద్దతు పలుకడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసినవారు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తామని ఎస్పీ తెలిపినట్లు కృష్ణ మాదిగ తెలిపారు. భవిష్యత్తులో యద్దనపూడి దళితులపై ఎలాంటి దాడులు జరగకుండా గ్రామంలో పోలీస్‌ పికెటింగ్‌ పెంచుతామని ఎస్పీ హామీ ఇచ్చారని తెలిపారు. వినతిపత్రం ఎస్పీకి అందజేసిన వారిలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ మున్నంగి నాగరాజుమాదిగ, ఎంఈఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి భిక్షాలు మాదిగ, బాపట్ల జిల్లా ఎంఎస్‌పి కన్వీనర్‌ బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య మాదిగ, గుంటూరు జిల్లా కన్వీనరు కూచిపూడి సత్యం మాదిగ, గుంటూరు జిల్లా ఎమ్మార్పీఎస్‌ కన్వీనర్‌ వేమూరి సుధీర్‌ మాదిగ, దళిత బాధిత కుటుంబాల సభ్యులు ఉన్నారు.