డౌన్‌లోడ్ కాని హాజరు నమోదు యాప్
ఒత్తిడికి గురవుతున్న ఉపాధ్యాయులు
ప్రజాశక్తి -భీమునిపట్నం ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్‌లో హాజరు నమోదు చేసి, ఆన్‌లైన్‌లో నివేదించాలన్న రాష్ట్రప్రభుత్వ ఆదేశాలపై ఉపాధ్యాయులు ఒకింత మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు పాఠశాల ప్రారంభమౌతుందని, అయితే అరగంట ముందే ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి, హాజరు నమోదుకు సంబంధిత యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, వివరాలను నివేదించాల్సి ఉంటుందని పలువురు ఉపాధ్యాయులు బుధవారం తనను కలిసిన ప్రజాశక్తి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నైజేషన యాప్‌ను అమలులోకి తెచ్చిన నేపథ్యంలో, జివిఎంసి పరిధిలో రెండు పాఠశాలలనుసందర్శించి, అక్కడి ఉపాధ్యాయుల అభిప్రాయాలను ప్రజాశక్తి తెలుసుకుంది.
మంగళవారం తొలిరోజున సర్వర్ డౌన్, నెట్‌వర్క్ పని చేయకపోవడంతో మధ్యాహ్నం 12గంటల వరకు యాప్ డౌన్‌లోడ్ కాలేదని జివిఎంసి యు పి పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్త పరిచారు.హాజరు నమోదుకు ప్రత్యేక డివైజెస్ ఇవ్వాలని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బుధవారం ఒక యుపి పాఠశాలను సందర్శించి, పరిశీలించగా, యాప్ డౌన్‌లోడ్ కాక, మొబైల్ ఫోన్‌లో అలాగే తిరుగుతూ ఉండడంతో ఉపాధ్యాయులు తిప్పలు పడడం కనిపించింది. అయితే ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు బుధవారం తాము యాప్ డౌన్‌లోడ్ చేసే ప్రయత్నం చేయలేదని ఉన్నత పాఠశాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు తెలిపారు. అయితే పేర్లు చెప్పేందుకు ఉపాధ్యాయులంతా
ముందుకు రాకపోవడం విశేషం. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు, వేధింపులు, ఉంటాయేమోనన్న భయం ఉందని ఒకరిద్దరు ఉపాధ్యాయులు అన్నారు.










