
ప్రజాశక్తి-గుంటూరు : యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యానిమేటర్ల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో యూనియన్ గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, మాట్లాడుతూ ఫార్మింగ్, నాన్ ఫార్మింగ్ యూనిట్స్ టార్గెట్‌లతో యానిమేటర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులు ఈ టార్గెట్స్‌తో అప్పులపాలు కావాల్సి వస్తుందన్నారు. బలవంతంగా, సబ్సిడీ ఇవ్వకుండా, అధిక ధరకు కోళ్లు, గొర్రెలు, మేకల్ని అధికారులు చెప్పిన దగ్గరే కొనుగోలు చేయాలని వేధిస్తున్నారన్నారు. విత్తనాలు ఒక్కొక్క యానిమేటర్ 60 మందికి విక్రయించాలని చెప్పటం వల్ల డ్వాక్రా మహిళలకు బలవంతంగా అంటగట్టాల్సి వస్తుందన్నారు. అలాగే యానిమేటర్లకు పెట్టిన మూడు సంవత్సరాల కాలపరిమి చట్ట విరుద్ధమని అన్నారు. వేతనాలు యానిమేటర్ల ఖాతాల్లోనే జమ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ యానిమేటర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షురాలు దేబోరా మాట్లాడుతూ యానిమేటర్లకు రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి, డిఆర్‌డిఎ పీడీకి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా పీడీ స్పందిస్తూ గేదెలు, గొర్రెలు, కోళ్లు పలానా చోటే కొనాలనే నిబంధన పెట్టమని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు విమల, రాఘవ, జ్యోతి, పద్మ, శిరీష, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.