
రాయచోటి టౌన్ : ప్రభుత్వం యానిమేటర్లకు మూడేళ్ల వరకే ఉద్యోగం ఉండేలా విడుదల చేసిన కాలపరిమితి సర్క్యలర్ 64ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జి.రెడ్డెప్ప అన్నారు. యానిమేటర్ల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన యానిమేటర్ల నిరసనలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక ప్రగతికి తోడ్పడే 28 వేల మంది యానిమేటర్ల కుటుంబాలు ప్రభుత్వ అనాలోచనతో విడుదల చేసిన 64వ సర్క్యులర్‌తో రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించుకొని మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.8 వేల జీతంలో ప్రభుత్వ యాప్‌లకు, రవాణా ఖర్చులకు 3వేలు ఖర్చు పోగా, కేవలం రూ.5 వేలతో కుటుంబాలు నెగ్గుకు రావాలంటే చాలా ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. జీతాలు రాక, చేసిన అప్పులతో వ్యధకు గురై పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, పెరిగిన ధరలతో తీవ్ర ఇక్కట్లతో మానసిక ఆందోళనల నుండి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.ఏప్రిల్ నుండి పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యానిమేటర్ల సంఘం జిల్లా నాయకులు రాణి మాట్లాడుతూ ధరలకనుగుణంగా కనీసవేతనం రూ.21 వేలు ఇవ్వాలని, సిబిఒహెచ్‌ఆర్ అమలు చేసి, సంఘాల మార్జించు ఆపాలని, రూ.పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని లేనియడల రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కైనా వెనుకాడబోమని తెలిపారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ గిరీష అందజేశారు. కార్యక్రమంలో యానిమేటర్ల సంఘం జిల్లా కోశాధికారి సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు పరంజ్యోతి, కృష్ణమ్మ, పవన్, కరీముల్లా, కన్యాకుమారి, చెన్నమ్మ, ప్రసన్న పాల్గొన్నారు.