- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు
ప్రజాశక్తి- కలకడ : ప్రభుత్వం యానిమేటర్లకు మూడేళ్లకు వరకే ఉద్యోగం ఉండేలా విడుదల చేసిన కాలపరిమితి సర్క్యులర్ 64ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయ ఆవరణలో జరిగిన యానిమేటర్ల మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక ప్రగతికి తోడ్పడే 28 వేల మంది యానిమేటర్ల కుటుంబాలు ప్రభుత్వ అనాలోచనతో వదిలిన 64వ సర్క్యులర్‌తో రోడ్డున పడతారని పేర్కొన్నారు. ప్రభుత్వం పునరాలోచించుకొని మూడేళ్ల కాలపరిమితి రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే 8 వేల జీతంలో ప్రభుత్వ యాప్‌లకు, రవాణా ఖర్చులకు 3 వేలు ఖర్చు పోగా, కేవలం రూ.5 వేలతో కుటుంబాలు నెగ్గుకు రావాలంటే చాలా ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. జీతాలు రాక, చేసిన అప్పులతో వ్యధకు గురై పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, పెరిగిన ధరలతో తీవ్ర ఇక్కట్లతో మానసిక ఆందోళనల నుండి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యానిమేటర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రెడ్డెప్ప, ఉఫాధ్యక్షులు కృష్ణమ్మ మాట్లాడుతూ ధరలకనుగుణంగా కనీసవేతనం రూ.21 వేలు ఇవ్వాలని, సిబిఒ హెచ్‌ఆర్ అమలు చేసి, సంఘాల మెర్జింగ్ ఆపాలని, పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని లేని ఎడల రాష్ట్ర వ్యాపితంగా నిరవధిక సమ్మెకైనా సిద్ధమని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో గ్రూపులు తక్కువ ఉన్నాయనే నెపంతో విధుల నుండి తప్పించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. కార్యక్రమంలో యానిమేటర్లు వెలుగు రెడ్డప్ప కన్యాకుమారి, చెన్నమ్మ, ప్రసన్న పాల్గొన్నారు.










